కనీవినీ ఎరుగని స్థాయికి రూపాయి పతనం
డాలర్‌తో పోలిస్తే 81.18కి చేరిక అయినా చలనం లేని మోడీ సర్కార్
అంతర్జాతీయంగా మసకబారిన దేశ ప్రతిష్ట దిద్దుబాటును గాలికొదిలి మోడీ
ఫొటోల కోసం ఆర్థిక మంత్రి వెతుకులాట కేంద్రం తీరుపై
ట్విట్టర్ వేదికగా భగ్గుమన్న మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ పాలనపై తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలను సంధించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.18 కి రికార్డు స్థాయి కనిష్టానికి పడిపోయింది. ఒక్క రోజులోనే రూపాయి విలువ 83 పైసలు దిగజారింది.దీనిపై ట్విట్టర్ వేదికగా కెటిఆర్ స్పందించారు. మోడీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో ఇప్పటి వ రకు రూపాయి విలువ ఇంత దారుణంగా ఎప్పు డు పడిపోలేదన్నారు. అయినప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి రేషన్ షాపుల్లో ప్రధాని మోడీ ఫొటో కోసం వెతుకుతున్నారంటూ ఆయన సెటైర్ వేశారు.
పైగా కేంద్రం తన అసమర్థను కప్పిపుచ్చుకునేందుకు రూపాయి విలువ సాధారణంగానే పడిపోయిందని గప్పాలు కొడుతోందని మండిపడ్డారు. దీని కారణంగా ప్రపంచ దేశాల ముందు దేశ ప్రతిష్ట రోజురోజుకు మసకబారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్రం పెద్దలలో ఎలాంటి చలనం లేకపోవడం శోఛనీయమని వ్యా ఖ్యానించారు. ఎనిమిదేళ్ల మోడీ పాలన దేశాన్ని పూర్తిగా అతలాకుతలం చేసిందన్నారు. ఏ రంగం లో చూసిన అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని కెటిఆర్ పేర్కొన్నారు. విశ్వగురువు దేశ పా లనను గాలికి ఒదిలిపెట్టి బిజెపియేతర ప్రభుత్వాలను దొడ్డిదారిన కూల్తివేయడం, రాష్ట్రాలపై పెత్త నం చెలాయించడానికే సమయం సరిపోతోందని ఎద్దేవా చేశారు.ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని మంత్రి కెటిఆర్ విమర్శించారు. ఇక ద్రవ్యోల్బణం దారుణ స్థితికి చేరుకుందన్నారు. ఈ ఆర్థిక అవరోధాలకు ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ (మోడీ) కారణమని తన ట్వీట్‌లో కెటిఆర్ ఆరోపించారు.
ఇందుకు కారణమైన విశ్వగురువును పొగడండి అంటూ ఆయన సెటైర్లు వేశారు. రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పతనమైనా…. జుమ్లాలు మాత్రం ఎన్నడూ లేనంతగా వృద్ధి చెందాయని తీవ్ర స్థాయిలో వ్యంగ్యస్త్రాలను సంధించారు. ప్రపంచ మార్కెట్లు, ఫెడ్ రేట్ల కారణంగా రూపాయి విలువ పడిపోయిందని జ్ఞానాన్ని బోధిస్తున్న భక్తుల వాదనతో విశ్వగురు మోడీ అంగీకరించబోరని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అవినీతి చర్యల కారణంగానే రూపాయి విలువ పతనమైందని….. ప్రస్తుతం దేశం ఐసియూలో ఉందంటూ గతంలో మోడీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ…. రూపాయి పతనంపై నాటి కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారన్నారు. మరి ఇప్పుడు…..రూపాయి విలువ చాలా దారుణంగా పడిపోతే మోడీ ఎందుకు స్పందించడం లేదని కెటిఆర్ నిలదీశారు. ఇదే మోడీ డబుల్ (ఇంజన్) స్టాండ్ విధానం అంటూ ట్విట్టర్‌లో కెటిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
చాలా గర్వంగా ఉంది
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్‌ఎస్‌జి) పెద్ద రాష్ట్రాల విభాగంలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవడం గర్వంగా ఉందని మంత్రి కెటిఆర్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. వివిధ కేటగిరిలలో రాష్ట్రానికి 13 అవార్డులు రావడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంతోనే సాధ్యమైందన్నారు. ఈ పథకం సిఎం కెసిఆర్ మానసపుత్రిక అని అన్నారు. రాష్ట్రంలో పల్లెప్రగతి కార్యక్రమం ప్రారంభం అయినప్పటికీ నుంచి గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు. పల్లెలు పూర్తిగా పచ్చగా కళకళలాడుతున్నాయని కెటిఆర్ పేర్కొన్నారు. పారిశుధ్యం పనులు శరవేగంగా పరుగులు తీస్తుండడంతో గ్రామాలన్నీ సర్వంగా సుందరంగా తయరవుతున్నాయన్నారు. దీని కారణంగానే రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు కేంద్రం నుంచి అనేక అవార్డులు…రివార్డులు వస్తున్నాయన్నారు.
ఈ శాఖ పక్షనా కేంద్రం ఎలాంటి అవార్డులు ప్రకటించినా…అందులో తెలంగాణనే అగ్రస్థానంలో ఉంటోందన్నారు. ఇది కేవలం ఏదో ఒక సంవత్సరానికి పరిమితం కాకుండా…ప్రతి సంవత్సరం మనకే దక్కుతున్నాయని కెటిఆర్ పేర్కొన్నారు. ఇందుకు సిఎం కెసిఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్విట్టర్‌లో కెటిఆర్ పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటామన్నారు. అలాగే ప్రశంసలు అందుకుంటామన్నారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని అమలుచేస్తున్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును, సంబంధిత అధికారులతో పాటు 12,769 మంది సర్పంచులు, ఎంపిటిసిలు, పంచాయతీ కార్యదర్శులను కెటిఆర్ అభినందించారు.
రైతుల సంక్షేమంలో ఎప్పుడు ముందుంటాం
రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ట్విట్టర్ వేదికగా కెటిఆర్ అన్నారు. దేశంలోనే రైతులకు భరోసా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. రైతు బీమా పథకం ద్వారా ఈ ఏడాది 34 లక్షల మంది రైతులకు రూ. 1450 కోట్లు పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు. 85 లక్షల మంది రైతులకు రూ. 5 లక్షల చొప్పున పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.