చెన్నై: ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాలు, కార్యకర్తలపై తమిళనాడులో పెట్రోల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. చెన్నైలోని తాంబరంలో ఉంటున్న ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త సీతారామన్ నివాసంపై శనివారం తెల్లవారుజామున ఒక ఆగంతకుడు పెట్రోల్ బాంబు విసిరాడు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత 24 గంటల్లో ఈ తరహా దాడులు జరగడం ఇది మూడోసారి. ఉగ్రవాద సంబంధాలపై పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దేశ వ్యాప్తంగా కీలక దాడులు జరుపుతున్న నేపథ్యంలో చెన్నైలో పెట్రోల్ బాంబులు రువ్విన ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో తన నివాసం బయట పెద్దశబ్దం రావడం, మంటలు చెలరేగడం తో షార్టు సర్కూట్ అని మొదట అనుకున్నా తరువాత అదికాదని తేలిందని సీతారామన్ చెప్పారు. నిందితుడి ఫుటేజ్ లభించినట్టు తెలిపారు. కోయంబత్తూరు లోని కోవైపుదూర్‌లో కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఒక ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త నివాసంపై దుండగులు పెట్రోల్ బాంబు విసిరారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కేరళ లోని కన్నూరులో కూడా ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జరిగింది.
Petrol Bomb hurled at RSS Activist’s house in Chennai