జిన్‌పింగ్ గృహనిర్బంధం ?
కమ్యూనిస్టుపార్టీ కీలక చర్య
కొత్త నేతగా సైనిక జనరల్
నిర్థారణకాని వార్తలతో కలకలం
ఉజ్బెకిస్థాన్ నుంచి రాగానే బందీ
బీజింగ్ సమీపంలో దళాల కదలిక
ఉన్నట్లుండి విమానాల నిలిపివేత
బీజింగ్ : చైనా అధ్యక్షులు , కమ్యూనిస్టుపార్టీకి తిరుగులేని నేత జిన్‌పింగ్‌ను గృహనిర్బంధంలో ఉంచినట్లు అనధికారిక వార్తలు వెలువడ్డాయి. ఆయన నిరంకుశ వైఖరిని సహించలేక సైనిక తిరుగుబాటు జరిగిందని, ఇప్పుడు జీ బందీ అయ్యారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ మధ్యకాలంలో చైనా అధ్యక్షులు భారీ స్థాయిలో అధికారిక వ్యవస్థలో, సైనిక వర్గాలలో ప్రక్షాళనలకు దిగుతూ ఉండటంతో తదనంతర పరిణామాలతో దేశ అత్యంత శక్తివంతమైన సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పిఎల్‌ఎ) ఆయనను ఇంట్లోనే బందీగా చేసినట్లు చైనీయుల ట్వీట్లతో వెల్లడైంది. అయితే చైనా మీడియా ఈ వార్తలను ధృవీకరించలేదు.
చైనాలో ఓ మాజీ భద్రతా అధికారికి స్థానిక కోర్టు యావజ్జీవ శిక్ష విధించినట్లు ఇటీవలే బ్లూమ్‌బెర్గ్ అనుబంధ టీవీ ఛానల్ తెలిపింది. జి జిన్‌పింగ్ ఇటీవలి కాలంలో అత్యంత కీలకమైన పార్టీపరంగా అంతర్గత సంక్లిష్టతలతో కూడిన భారీ మార్పులు చేర్పులు చేపడుతున్న దశలోనే పిఎల్‌ఎ జిన్‌పింగ్‌ను నిర్బంధించినట్లు కీలక విషయాలు అంత తేలిగ్గా వెల్లడికాని చైనా నుంచి వార్తలు వెలువడ్డాయి. అయితే జిన్‌పింగ్‌ను అరెస్టు చేశారని, అధికారిక నివాసంలోనే ఉంచారని ఇప్పుడు అమెరికాలో ఉంటోన్న చైనా హక్కుల ఉద్యమకర్త జెన్నిఫర్ జెంగ్ ట్వీటు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె ఓ వీడియో కూడా జతచేశారు. ఇందులో ఏదో ప్రాంతం నుంచి పిఎల్‌ఎ బలగాలు బీజింగ్ వైపు వెళ్లుతున్నట్లు ఉంది.
ఈ నెల 22న సైనిక వర్గాలలో కదలిక ఏర్పడిందని తెలిపారు. దాదాపు 80 కిలోమీటర్ల దూరం వరకూ చైనా సైనికబలగాలు కదిలాయని , బీజింగ్‌కు సమీపంలోని హుయానలాయ్ కౌంటీ నుంచి హెబియి ప్రాంతపు జాంగియకౌ సిటీ వరకూ సైనిక ప్రస్థానం సాగిన దశలోనే జిన్‌పింగ్ అరెస్టు వార్తలు వెలువడ్డాయి. అంతేకాకుండా పిఎల్‌ఎ సర్వం సారధ్య హోదా నుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ సీనియర్లు తొలిగించారని కూడా ప్రచారం ఆరంభం అయింది. జెన్నిఫర్ ట్వీటు ఇప్పుడు పశ్చిమదేశాలలో తీవ్రచర్చనీయాంశం అయింది. ఇక చైనాలో దాదాపు 60 శాతం వరకూ విమానాల రాకపోకలను ఎటువంటి కారణంలేకుండానే, సమాచారం లేకుండానే నిలిచిపొయ్యాయి. ఇది మరింతగా జిన్‌పింగ్ గందరగోళానికి దారితీసింది. ఇప్పుడు చైనాను వీడి అమెరికాలో ఉంటున్న చీని రచయిత గార్డన్ ఛాంట్ కూడా జెంగ్ వీడియోను ప్రస్తావిస్తూ చైనాలో ఏదో జరుగుతోంది. ఇప్పటికే ఏదో జరిగింది. నిప్పు లేనిదే పొగరాదని, మొత్తం మీద చైనా కమ్యూనిస్టు పార్టీలో అస్థిరత్వం నెలకొంది, దీనిపై ఇక పలు వార్తలు వెలువడుతాయని వ్యాఖ్యానించారు.ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగిన షాంఘై సహకార సంఘం సమావేశంలో పాల్గొని బీజింగ్‌కు చేరుకున్న వెంటనే జిన్‌పింగ్‌ను నిర్బంధించారని ఇంటికి తరలించారని వార్తలు వెలువడుతున్నాయి.
చైనా అధినేతగా లి కియోమింగ్‌కు పగ్గాలు?
కలకాలం పగ్గాలు చేపట్టాలనే ఆశలతో ఉన్న జిన్‌పింగ్‌ను బందీగా చేసి ఇప్పుడు దేశానికి అధినేతగా చైనా సైన్యం పిఎల్‌ఎగా ఉన్న లి కియోమింగ్ బాధ్యతలు చేపట్టి ఉంటారని వదంతులు వ్యాప్తిలోకి వచ్చాయి. చైనా పరిణామాలపై కొందరు భారతీయ నేతలు కూడా ట్వీట్ల ద్వారా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు వెలువడుతున్న వదంతులను పరిశీలించుకోవల్సి ఉందని బిజెపి నేత , లిటిగెంట్ల ప్రముఖులైన డాక్టర్ సుబ్రమణ్యస్వామి స్పందించారు. జి జిన్‌పింగ్ ఇటీవల సమర్‌కండ్‌కు వెళ్లినప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీ సీనియర్లు భేటీ జరిపి ఆయనను పార్టీ నేత పదవి నుంచి తీసేసి ఉంటారని స్వామి వ్యాఖ్యానించారు.