మైసూరు: నయనానందకరంగా 10 రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం నాడిక్కడ ప్రారంభించారు. రాష్ట్ర ఉత్సవంగా అత్యంత వైభవంగా మైసూరులో జరిగే దసరా ఉత్సవాలలో రాష్ట్రపతి పాల్గొనడం ఇదే మొదటిసారి. ఘనమైన కర్నాటక సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా నిర్వహించే దసరా ఉత్సవాలను తిలకించడానికి మైసూరుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు చేరుకుంటారు. కొవిడ్ కారణంగా గడచినరెండు సంవత్సరాలు ఈ ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలేదు.
చాముండి హిల్స్‌పై వెలసిన చాముండేశ్వరి ఆలయంలో వృశ్చిక లగ్న శుభఘడియలలో వేద మంత్రాల పఠనం నడుమ రాష్ట్రపతి ముర్ము మైసూరు మహరాజ వంశస్తుల ఆరాధ్య దేవత చాముండేశ్వరి దేవిపై పుష్ప వర్షం కురిపించి దసరా ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నాటక గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, శోభా కరండ్లజే, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ముర్ము ఒక రాష్ట్రాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.