కేసు విచారణకోసం లాయర్లకు ఎంత చెల్లిస్తున్నారు
పర్యావరణాన్ని కాపాడడంలో శ్రద్ధ ఏది? ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు
మన తెలంగాణ/హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పీళ్లకు వెళ్లటం పట్ల సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం సుప్రీకోర్టు ధర్మాసనం పోలవరం ప్రాజెక్టు అప్పీళ్ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జరిగిన పర్యావరణ నష్టాలకు ప్రభుత్వం ఎందు కు బాధ్యత వహించదని ఏపి ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. న్యాయవాదులకు పీజు చెల్లింపులపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ద పర్యావరణాన్ని కాపాడటంలో కనిపించటం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ప్రిన్సిపల్ బెంచ్ ఏపి ప్రభుత్వానికి రూ.120కోట్లు జరిమాన విధించింది. పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయంటూ మొత్తం మూడు ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను పొందుపరుస్తూ ఎన్జీటి తీర్పు వెల్లడించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇందులో మూడు అంశాలకు సం బంధించి ఏపి ప్రభుత్వం విడివిడిగా మూడు అ ప్పీళ్లను దాఖలు చేసింది. ఈ అప్పీళ్లపై జస్టిస్ రస్తోగి, జస్టిస్ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికీ పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న పెంటపాటి పుల్లారావు తరుపు న్యాయవాది ధార్మాసనం దృష్టికి తీసుకుపోయారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం అప్పీళ్ల విషయంలో పలు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఒక్క కేసుకు ఎంత మంది సీనియర్ లాయర్లను ఎంగేజ్ చేస్తున్నారని ప్రశ్నించింది. వీరితో కేసులు వాదిస్తున్నందుకు తీసుకుంటున్నంత శ్రద్ద పర్యవారణ పరిరక్షణలో తీసుకోవటం లేదని పేర్కొంది. ఈ కేసులో లాయర్లకు ప్రభుత్వం ఎంత ఫీజు చెల్లించిందో తెలుసుకునేందుకు అవసరమైతే నోటీసులు ఇచ్చేందకు కూడా సిద్దంగా ఉన్నట్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్జీటి తీర్పులపై దాఖలైన అప్పీళ్లన్నింటినీ ఒకే సారి విచారిస్తామని వెల్లడించింది. పోలవరం, పురుషోత్తమపట్నం, పులిచితల ప్రాజెక్టులపై ఇచ్చిన తీర్పులపై విచారణ చేపడతామని ప్రకటించింది. ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన మూడు అప్పీళ్ల కేసు విచారణను వాయిదా వేసింది.
Supreme Court Serious on AP Govt over Polavaram Project