శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘె వెల్లడి
కొలంబో: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్న భారత్, జపాన్‌కు తమ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె తెలిపారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు జపాన్ చేరుకున్న విక్రమసింఘె మంగళవారం జపాన్ విదేశాంగ మంత్రి యోషిసా హయసాషితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికలపై శ్రీలంకకు జపాన్ అందచేస్తున్న మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం దక్కించుకోవడానికి జపాన్, భారత్ సాగిస్తున్న ప్రయత్నాలకు తాము మద్దతు ఇస్తామని విక్రమసింఘె తెలిపారు. ప్రస్తుతం భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్యదేశాలు, 10 అశాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. అశాశ్వత సభ్యులను రెండేళ్లకోసారి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఎన్నుకుంటుంది. రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, అమెరికా శాశ్వత సభ్య దేశాలు కాగా వర్తమాన ప్రపంచ వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి భద్రతా మండలిలో భారత్ సభ్యత్వం ముగియనున్నది.