ఆశాపరేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
30న జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో పురస్కారం ప్రదానం
న్యూఢిల్లీ: దేశంలో సినీ రంగానికి సంబంధించి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ప్రముఖ బాలీవుడ్ నటి ఆశాపరేఖ్ ఎంపికయినట్లు కేంద్ర, సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం ప్రకటించారు. 2020 సంవత్సరానికి గాను ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు. అంతకుముందు 2019లో సూపర్‌స్టార్ రజనీ కాంత్ ఈ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత కొవిడ్ కారణంగా ఈ అవార్డులను ఇవ్వలేదు. శుక్రవారం జరిగే 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆశాకు అవార్డును ప్రదానం చేయనుంది. అశాభోంస్లే, హేమామాలిని, పూనమ్ ధిల్లాన్, ఉదిత్ నారాయణ్, టిఎస్ నాగాభరణలతో కూడిన అయిదుగురు సభ్యుల జ్యూరీ ఆశాపరేఖ్‌ను ఈ అవార్డుకు ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఠాకూర్ తన నియోజకవర్గమైన హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో విలేఖరులకు చెప్పారు. ఆశాపరేఖ్ 1942 అక్టోబర్ 2న గుజరాతీ కుటుంబంలో జన్మించారు. తన తల్లి ప్రోత్సాహంతో ఆశా బాల్యంలోనే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నారు.అది కాస్తా నటనపై ఆసక్తిని పెంచింది. అలా 1952లో తెరకెక్కిన ‘మా’ అనే హిందీ సినిమాలో బాలనటిగా ఆమె తెరంగేట్రం చేశారు. ఆస్మాన్, ధోబి డాక్టర్, శ్రీ చైతన్య మహాప్రభు, బాప్ బేటీ తదితర చిత్రాల్లో బాలనటిగా సందడి చేసిన ఆశా ‘దిల్ దేకే దేఖో’ చిత్రంతో కథానాయికగా మారారు.
నటిగా తొలి చిత్రంలోనే మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత ఆమె వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఒక్కో ఏడాది గరిష్ఠంగా ఆరు చిత్రాల్లో నటించే వారు. ఘరానా, జిద్దీ, లవ్ ఇన్ టోక్యో, తీస్రీ మంజిల్, ఫిర్ ఓహి దిల్ లాయా హూ, భరోసా లాంటి పలు సూపర్ హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. కథానాయికగా దేవానంద్, షమ్మీకపూర్, రాజేశ్ ఖన్నా వంటి అగ్రనటులతో తెరను పంచుకున్నారు. బాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉండే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా 1970 దశకంలో ఆశా నిలిచారు. హిందీతో పాటుగా గుజరాతీ, కన్నడ భాషల్లో 95కు పైగా చిత్రాల్లో నటించిన ఆశా 1990 దశకం చివర్లో ప్రముఖ టీవీ డ్రామా ‘కోరాకాగజ్ ’ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు. అంతేకాకుండా 1998, 2001 మధ్య కాలంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్( సిబిఎఫ్‌సి)కి తొలి మహిళా చైర్మన్‌గా సేవలందించారు. 2017లో ఆమె సినీ విమర్శకుడు ఖాలిద్ మహమ్మద్‌తో కలిసి ‘ది హిట్ గర్ల్’ పేరుతో ఆత్మకథను వెలువరించారు. 1995లో వచ్చిన ‘ఆందోళన్’ నటిగా ఆశాకు చివరి సినిమా. 1999లో వచ్చిన ‘సర్ ఆంఖో పర్’అనే సినిమాలో చిన్నపాత్రలో కనిపించిన ఆశా ఆ తర్వాత నటనకు దూరమయ్యారు.79 ఏళ్ల ఆశాపరేఖ్ పెళ్లి చేసుకోకుండా అవివాహితగానే ఉండిపోయారు. 1992లో కేంద్ర ప్రభుత్వం ఆమెను ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది.
Centre announced Dadasaheb Phalke Award to Asha Parekh