డబుల్ బెడ్రూం ఇండ్ల అక్రమార్కులపై ఉక్కుపాదం
డబ్బులతో ఇళ్లు వస్తుందంటే అది ముమ్మాటికీ అక్రమమే
పేదలకు ఉచితంగానే డబుల్ బెడ్రూం ఇండ్లు
ఆడియో టేపుల వ్యవహారంపైనా విచారణకు ఆదేశాలు
అక్రమార్కులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు: మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్: డబుల్ బెడ్రూం ఇండ్ల అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దందా చేసిన అక్రమార్కులను అదుపులోకి తీసుకున్న పోలీసులను ఆయన అభినందించారు. పేద ప్రజలెవరూ దళారుల బారిన పడి మోసపోవద్దని మంత్రి కోరారు. డబ్బులతో డబుల్ బెడ్రూం ఇళ్లు వస్తుందని భావిస్తే అది ముమ్మాటికీ ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్ ద్వారా మాత్రమే వస్తున్నదేనని అర్థం చేసుకునాలని… అది ముమ్మాటికీ తప్పుడు మార్గమేనని గుర్తించాలని సూచించారు. అలా అక్రమ మార్గంలో ఇళ్లు వస్తుందంటే మోసపోవడమేనన్నారు. ప్రభుత్వం నిజాయతీగా పేదలకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తుందని తెలిపారు. ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇండ్ల ఆశతో ఎవరైనా డబ్బులు ఇచ్చి మోసపోయి ఉంటే కూడా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. పేదల ప్రజలను మోసం చేసే వారు ఎంతటి వారైనా శిక్షతప్పదన్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్లు, పింఛన్లు సహా పేదలకు లభించే అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఎవరైన డబ్బులు అడిగినా, అప్పటికే ఇచ్చి మోసపోయినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయమని మంత్రి సూచించారు. ఇలాంటి వారి పట్ల అధికారులు సైతం నిఘా వేయాలని ఆదేశించారు. పేద ప్రజలకు నిజాయతీగా ప్రభుత్వ పథకాలు అందేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని… పేద ప్రజలను మోసం చేసిన వారిని ఎవరినీ వదలబోమని హెచ్చరించారు. మోసపోయిన వారు ఎవరైనా ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే కఠినంగా శిక్ష పడి వారికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. మరోవైపు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో టేపుల అంశంతో పాటు డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి సత్వరమే పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని జిల్లా ఎస్పీ, కలెక్టర్ ను ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అక్రమాలు చేయాలంటేనే హడలి పోయేలా కఠిన చర్యలు తీసుకునాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రిశ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.