అడ్డుగోడలు, దించిన తెరలు తొలగిపోయి కళ్లకు, చెవులకు దారి ఏర్పడడం చిన్న పరిణామం కాదు. భారత రాజ్యాంగం 21వ అధికరణ హామీ ఇస్తున్న వ్యక్తి స్వేచ్ఛను నిరోధించే ఏ అవరోధమైనా అదృశ్యం కావడం హర్షామోదాలతో చప్పట్లు కొట్టవలసిన గణనీయమైన సందర్భమే. కీలకమైన రాజ్యాంగ ధర్మాసన విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడం దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలోనే కాదు, ప్రజాస్వామ్య ప్రస్థానంలోనే మంచి మలుపు. ఇది అమలులోకి రావడం మన దేశంలోనే మొదటిసారి కాదు. అయినా సుప్రీంకోర్టు ధర్మాసనాల ముందు న్యాయవాదులు చేసే వాదోపవాదాలు, న్యాయమూర్తుల అభిప్రాయ ప్రకటనలు, తీర్పులు వినిపించడాన్నీ వారి హావభావాలు సహా ప్రత్యక్షంగా ఎంత దూరం నుంచైనా చూసే అవకాశం కలగడం చెప్పుకోదగ్గ విశేషమే.
వాటి మీద తమకు గలిగే అభిప్రాయాలను ప్రజలు వ్యక్తం చేయడానికి, వారి మధ్య చర్చకు కూడా వీలు కలుగుతుంది. కొంత కాలం క్రితమే అనుకున్న రీతిలో మంగళవారం నాడు మూడు సుప్రీంకోర్టు ధర్మాసనాలు విడివిడిగా జరిపిన విచారణలను ప్రత్యక్షంగా చూసే అవకాశం మొదటిసారిగా కలగడం అబ్బురపరిచింది. ఈ మూడు ధర్మాసనాలకు భారత ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ విడివిడిగా సారథ్యం వహించారు. ఎటువంటి సాంకేతిక సవాళ్లు లేకుండా ప్రసారాలు తుదికంటా నిర్విఘ్నంగా జరిగాయి. సిజెఐ అధ్యక్షతన గల రాజ్యాంగ ధర్మాసనం ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోటా (10%) పై దాఖలైన కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారంలో నిర్వహించింది. మొదటి రోజు ప్రత్యక్ష ప్రసారాలను ఎనిమిది లక్షల మందికి పైగా జనం చూశారని, ఇది చరిత్రాత్మకమైన దినమని సుప్రీంకోర్టు ప్రజాసంబంధాల కార్యాలయం ప్రకటించింది. ప్రజలు తమంత తాము గా రాజ్యాంగం ద్వారా ఏర్పరచుకున్న న్యాయస్థానాల్లో జరిగే కేసుల విచారణను చూసే అవకాశం వారికి ఇంత కాలం లేకపోడమే బాధాకరం.
ప్రత్యక్ష ప్రసారం ప్రతిపాదన ఏడేళ్ల క్రితమే వచ్చింది. కాని 2015లో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని, 99వ రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో తొలి అవరోధం ఎదురైంది. న్యాయమూర్తుల నియామకాల వెనుక హేతుబద్ధతను ప్రభుత్వంతో పంచుకోడం కష్టసాధ్యమని ఆ తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఆ తర్వాత నియామకాలకు కొలీజియం విధానాన్ని పాటించడంపై ప్రజాభిప్రాయాన్ని కోరింది. దానికి 11,500 అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొలీజియం తన తీర్మానాలను సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో పెట్టడం ప్రారంభించింది. కేసుల కేటాయింపులో సిజెఐ వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు నలుగురు బహిరంగంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శించడంతో న్యాయ వ్యవస్థ గోప్యత ముసుగు పూర్తిగా తొలగిపోయింది.
ఇది 2018 జనవరి 12న జరిగింది. అదే సంవత్సరం స్వప్నిల్ త్రిపాఠి x సుప్రీంకోర్టు కేసులో తన ధర్మాసనాల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అయినా ఇంత కాలం అది అమల్లోకి రాలేదు. ఈలోగా కొవిడ్ కాలంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు వారి ఇంటి వద్ద నుంచే వర్చువల్ (దూర దృశ్య విధానం) పద్ధతిలో విచారణల్లో పాల్గొనడం మొదలైంది. సాంకేతిక వికాసం ఇందుకు బాగా తోడ్పడింది. ఈ విచారణలను యూ ట్యూబ్ ద్వారా ప్రసారం చేయడం పట్ల బిజెపి నాయకుడు గోవిందాచార్య వ్యక్తం చేసిన భయాలను సిజెఐ కొట్టిపారేశారు. స్వప్నిల్ త్రిపాఠి కేసులో తీర్పు ఇస్తూ ప్రత్యక్ష ప్రసారాలు న్యాయం అందుబాటుకు పౌరులకు రాజ్యాంగం ఆర్టికల్ 21 ఇచ్చిన హక్కు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఈ ప్రసారాల్లో తాము కనిపించరాదని కోరుకునే సాక్షులకు తగిన వెసులుబాటు వుంటుంది. అలాగే లైంగిక దాడి, అత్యాచారం వంటి కేసుల్లో బాధితులు తెలియజేసే సున్నితమైన అంశాలు బహిర్గతం కాకుండా చూస్తారు. బాల నేరస్థుల ప్రయోజనాలను కాపాడుతారు. ప్రత్యక్ష ప్రసారాల వల్ల కీలక కేసుల విచారణ జరిగినప్పుడు కోర్టులు కిక్కిరిసిపోడం తొలగుతుంది. ఈ విధానం అన్ని కేసుల విచారణలకూ హైకోర్టులకు, కింది కోర్టులకు వర్తింపు చేయాలి. ఈ పద్ధతిని అమెరికాలో 1955లోనే మొదలుపెట్టారు. అలాగే ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, దక్షిణాఫ్రికా, బ్రిటన్‌లలో ఈ విధానం కొంత కాలం క్రితమే మొదలైంది. సంచలనం కోసం యూ ట్యూబుల్లో, సామాజిక మాధ్యమాల్లో వాస్తవాలను వక్రీకరించే విధంగా శీర్షికలు పెట్టి ప్రసారం చేయడాన్ని పరిహరించవలసి వుంది. న్యాయాన్ని, న్యాయ వ్యవస్థ లోపలి అరల్లో జరిగే వాదనలను, విచారణలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తేవడం నిస్సందేహంగా చరిత్రాత్మక పరిణామమే.