మన తెలంగాణ/హైదరాబాద్: సినీ హీరో మహేశ్‌బాబు నివాస ప్రాంగణంలోకి మంగళవారం రాత్రి గుర్తుతెలియని ఆగంతుకుడు వచ్చాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నం.81లో మహేష్‌బాబు కుటుంబంతో ఉంటున్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆయన నివాస ప్రాంగణంలో ప్రహరీ వద్ద పెద్ద శబ్దం వచ్చింది. ఆగంతకుడు ఎత్తయిన గోడపై నుంచి దూకడంతో తీవ్ర గాయలయ్యాయి. శబ్దం విని సెక్యూరిటీ సబ్బంది వెళ్లి చూడగా ఓ వ్యక్తి మూలుగుతూ గాయాలపాలై పడి ఉన్నాడు. అతన్ని వెంటనే పట్టుకొని విచారించిన సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని స్టేషన్ కు తరలించి విచారించారు. నిందితుడు మూడు రోజుల కిందట ఒడిశా నుంచి వచ్చినట్లు గుర్తించారు. అతడు మహేష్ బాబు ఇంటి సమీపంలో ఉన్న ఒక నర్సరీ వద్ద ఉంటున్నాడని తెలిసింది. చోరీ కోసం వచ్చిన అతను 30 అడుగుల ప్రహరీ గోడపైనుంచి దూకాడు. దీంతో అతనికి గాయాలయ్యాయి. నిందితుడిని కృష్ణ(30)గా గుర్తించారు. ప్రాథమిక విచారణ అనంతరం కృష్ణను చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన జరిగిన సమయంలో మహేష్‌బాబు నివాసంలో లేనట్లు తెలిసింది.
Theft attempt in Mahesh Babu’s House