Friday, January 24, 2025

విశ్వవిపణిలో ‘రాజన్న సిరిపట్టు’

- Advertisement -
- Advertisement -

Bathukamma sarees to be distributed from oct 2

ఆత్మహత్యల పర్వం నుంచి అద్భుతమైన కళా నైపుణ్యం కలిగిన చీరలను అందించే దిశగా సిరిసిల్ల పరుగులు పెడుతోంది. కళాత్మకత కలిగిన చీరల నేతతో పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, ధర్మవరం, కంచి తదితర ఊర్లకు తెచ్చిపెట్టిన గుర్తింపు తరహాలోనే సిరిసిల్ల పతాకం రెపరెపలాడనున్నది. కాటన్ వస్త్ర పరిశ్రమకు హబ్‌గా ఉన్న సిరిసిల్ల తనదైన ప్రత్యేక శైలిని ఆపాదించుకుని జరీ అంచు చీర నేతకు కొత్త అధ్యయాన్ని తెరలేపింది. దీంతో న్యూజిలాండ్ దేశం ఫిదా అయి, చీరల కొనుగోలుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే బతుకమ్మ చీరలతో దేశ వ్యాప్తంగా పరిచయమైన సిరిసిల్ల, పట్టుచీరల ఉత్పత్తితో ప్రపంచ వ్యాప్తంగా పేరు ఆపాదించుకునే దిశలో అడుగులు వేస్తున్నది. సిరిసిల్ల పట్టుచీర ‘రాజన్న సిరిపట్టు’గా అంతర్జాతీయ వేదికలపై అందరినీ ఆకర్షించనున్నది. 1920లో సిరిసిల్లకు చెందిన కొంత మంది యువకులు మహారాష్ర్టలోని షోలాపూర్‌కు వెళ్ళి అక్కడ ఉపాధి పొందే క్రమంలో నేత పనిలో కుదురుకున్నారు.

చేనేతలో పూర్తిస్ధాయి నైపుణ్యత పొందిన తర్వాత తిరిగి సిరిసిల్లకు వచ్చి సొంతంగా మగ్గాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో చాలా కుటుంబాలు ఈ వృత్తిలో ప్రవేశించి వస్త్ర పరిశ్రమను విస్తృతం చేశారు. నేతపనితో పాటు దీనికి అనుబంధంగా ఉన్న డైయింగ్, సైజింగ్, వైండింగ్ తదితర విభాగాలు ఏర్పాటై చుట్టుముట్టు 50 గ్రామాల వరకు ఈ పరిశ్రమ విస్తరించింది. 1974లో తొలిసారి మరమగ్గాలు ఇక్కడ ప్రవేశించాయి. అప్పటి పద్మశాలి సంఘం కార్యదర్శి పత్తిపాక విశ్వనాధం షోలాపూర్ నుంచి ఈ మగ్గాలు దిగుమతి చేసుకుని వస్త్ర ఉత్పత్తిలో కొత్త శకాన్ని ప్రారంభించాడు. ఇది కాస్త అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఒక్క సిరిసిల్ల పట్టణంలోనే 34 వేల మరమగ్గాలు పని చేస్తున్నాయి. చేనేతను మరమగ్గాలు మింగేశాయి. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నల్ల పరంధాములు మగ్గం ప్రతిభ అటకెక్కిందనే అంతా భావించారు. మరమగ్గాలు కాటన్, పాలిస్టర్ షూటింగ్, షర్టింగ్‌ల గుడ్డ ఉత్పత్తికే పరిమితమయ్యాయి. మగ్గం నేసే కళాకారులు మరమగ్గాలను నడిపించలేకపోయారు. దీంతో ఉపాధి కరువై ఆత్మహత్యల సంఖ్య పెరిగి సిరిసిల్ల కాస్త ‘ఉరి’శాలగా మారింది.

తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రధానంగా సిరిసిల్లపై దృష్టి సారించింది. తెరాస పార్టీ, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కెటిఆర్ ఇక్కడి నుంచి శాసనసభ్యుడుగా ఉండటం సిరిసిల్లకు వరంగా మారింది. చేనేత మంత్రిగా కొనసాగుతూ ఆత్మహత్యలకు విరుగుడుగా ఏడాది పొడవునా ఉపాధి కల్పించే పథకాలకు రూపకల్పన జరిగింది. అగ్గిపెట్టె, దబ్బనం, ఉంగరం, సూదిలో దూరే చీరలను నేసిన ప్రతిభను మరమగ్గాలపై అందించే అవకాశం చేనేత కళాకారులకు లభించింది. బతుకమ్మ చీరలు వచ్చాక మరమగ్గాలపై చీరలు తయారీ మొదలయింది. కాటన్, పాలిస్టర్ సాదా వస్త్రాలకు పరిమితమైన మరమగ్గాలు ఈ రోజు చీరల తయారీతో కొత్తదనానికి నాంది పలికింది. విభిన్న డిజైన్లతో కూడుకున్న రంగు రంగుల చీరల తయారీతో చేనేత కళాకారులకు ఉపాధి మెరుగైంది. చేనేత, అనుబంధ వృతి కళాకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ నేతన్నలకు ఉపాధి, బతుకమ్మ చీరల తయారీ, నేతన్న బీమా, త్రిప్టు, చేనేత మిత్ర తదితర పథకాలు అందివచ్చాయి. దీంతో ఇక్కడి చేనేత కళాకారులు అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించగలుగుతున్నారు.

Bathukamma Sarees in 287 Designs

పరిమళించే పట్టు చీరను రూపొందించి నల్ల విజయ్ కుమార్ ‘ఔరా’ అనిపించాడు. ఐదున్నర మీటర్ల పొడవున్న ఎర్రని పట్టుచీరను నేసి, డైయింగ్ సమయంలో సువాసనిచ్చే శ్రీగంధం కలిపి నిత్యం పరిమళించే చీరగా రూపొందించాడు. అలాగే ముతకరకం పాలిస్టర్, కాటన్ ఉత్పత్తుల స్థానంలో కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. సాధారణ మగ్గాలకు డాబీ, జకార్డు పరికరాలు అమర్చి, సూచించిన డిజైన్లలో పట్టు వస్త్రాలు నేయడంలో వెల్ది హరిప్రసాద్ కొత్త ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. మరమగ్గాలను ఎలక్ట్రానిక్ జకార్డులతో ఆధునీకరించి పట్టు చీరలను తయారు చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, హైదరాబాద్‌తో పాటు అమెరికా, న్యూజిలాండ్‌లకు ఎగుమతి చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు ప్రజల అభిరుచిని దృష్టి లో పెట్టుకుని, మారుతున్న సమాజానికి అనుగుణంగా పట్టు వస్త్రాలకు రూపకల్పన చేస్తున్నాడు. దీంతో విదేశాల్లోని ప్రవాసాంధ్రులు హరిప్రసాద్ వస్త్రాలకు ఆకర్షితులవుతున్నారు. హరిప్రసాద్ బాటలో మరింత మంది నేత కళాకారులు తమ సృజనాత్మకతకు మెరుగులు దిద్డుకుంటున్నారు.

Sarees

బతుకమ్మ చీరల ప్రతిభను సోషల్ మీడియా అక్కునజేర్చుకుంది. న్యూజిలాండ్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ, బ్రాండ్ తెలంగాణ ఫేస్‌బుక్ నిర్వహకురాలు, సామాజిక సేవకురాలు సునితా విజయ్‌ను ఈ చీరలు అబ్బురపరిచాయి. ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన చీరలు న్యూజిలాండ్ మహిళలను ఆకట్టుకున్నాయి. ‘సిరిసిల్ల చీర’ పేరుతో ఆ దేశంలో విస్తృత ప్రచారం కల్పించింది. అక్కడి తెలుగు మహిళలకు బతుకమ్మ చీర కట్టించి బతుకమ్మను ఆడించింది. హరిప్రసాద్‌లాంటి నైపుణ్యం కలిగిన నేత కళాకారుల గురించి తెలుసుకుని, వినూత్న ఉత్పత్తులను తయారు చేసేలా ప్రోత్సహించింది. ఆమె పలుమార్లు సిరిసిల్లలో పర్యటించి ఇక్కడి చీరలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టేలా ముందుకు కదిలింది. పట్టుచీరల తయారీకి ఇక్కడి నేత కళాకారులకు చేయూతనిచ్చింది. భిన్న డిజైన్లు కలిగిన నాణ్యమైన చీరలను అమెరికా, యుకె, న్యూజిలాండ్ వంటి పలు దేశాల్లో నివాసముంటున్న పరిచయస్తులకు సిరిసిల్ల పట్టుచీరల ఆర్డర్లు ఇప్పించింది. వీటికి ఓ బ్రాండ్ తీసుకురావలన్న పట్టుదలతో ‘రాజన్న సిరిపట్టు’గా పేరు పెట్టి న్యూజిలాండ్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆ దేశ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ చేతుల మీదుగా ఆవిష్కరింప జేసింది. మూడు వందల మంది ప్రవాస భారతీయుల సమక్షంలో సిరిసిల్ల ఉత్పత్తులను ప్రదర్శించడమే కాకుండా ఫ్యాషన్ షో ఏర్పాటు చాలా మందిని ఆకట్టుకుంది. ఈ చీరలను సొంత చేసుకోవాలన్న ఆసక్తిని వారిలో కలిగించింది.

‘రాజన్న సిరిపట్టు’ తయారీలో సుమారు 40 మంది నేత కళాకారులు పాలుపంచుకుంటున్నారు. సాధారణ చీరలు, బతుకమ్మ చీరలకు భిన్నంగా నాణ్యమైన పట్టుచీరలు ఉత్పత్తికి సిరిసిల్ల కేంద్ర బిందువు కావలన్నది బ్రాండ్ తెలంగాణ ఫౌండర్ సునీత విజయ్ ఆకాంక్ష. తొలుత హరిప్రసాద్‌తో ప్రారంభించి, మరింత మంది నేతకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చింది. ఆరు దేశాల్లో మార్కెటింగ్ కల్పిస్తూ తెలంగాణకు గుర్తింపు తెచ్చిపెట్టేందుకు బ్రాండ్ తెలంగాణ కో పౌండర్లు విజయ్ కోస్న, కళ్యాణ్‌రావు కాసుగంటి, ఇనుగంటి నర్సింగరావు, పోకల కిరణ్, న్యూజిలాండ్ ఎన్‌ఆర్‌ఐ కుటుంబాలు కృషి చేస్తున్నాయి.

విశ్వ విపణిలో అడుగుపెట్టిన సిరిసిల్ల పట్టుచీరల పట్ల కెటిఆర్ సంతోషం అంతా ఇంతా కాదు. సృజనాత్మకతకు మారుపేరుగా నిలిచిన నేతన్నలు చెన్నైలోని తిరువూరు పట్టణానికి దీటుగా సిరిసిల్ల కావాలని ఆకాక్షించారు. నైపుణ్యాలున్న కొత్త తరం ముందుకు రావాలని కోరుకుంటున్నారు. ఆ మేరకు కావలసిన మౌలిక సదుపాయాలను తమ ప్రభుత్వం అందివ్వడంలో వెనుకాడబోదని తేల్చి చేప్పారు. కార్మికుడిని యజమానిగా మార్చాలన్న మంత్రి కెటిఆర్ సంకల్పం ‘వర్కర్ టు ఓనర్’ పథకం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే విశ్వ విపణిలో పోటీపడే చేనేత కళాకారులు తప్పకుండా అందివస్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ర్ట ప్రభుత్వంతో కలిసివచ్చి చేనేతపై విధించిన జిఎస్‌టిని రద్దు పరిస్తే పట్టు చీరల పరిమళం ప్రపంచ వ్యాప్తంగా పరుచుకుంటుదనడంలో సందేహముండదు.

కోడం పవన్‌కుమార్
9848992825

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News