న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సిడిఎస్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. 61 సంవత్సరాల చౌహాన్ సైనిక వ్యవహారాల శాఖలో కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు. హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ మరణించిన తర్వాత ఖాళీ అయిన ఆ స్థానాన్ని తొమ్మిది నెలల తర్వాత భర్తీ చేస్తూ ప్రభుత్వం బుధవారం నూతన సిడిఎస్‌గా చౌహాన్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. జనరల్ రావత్ పనిచేసిన 11 గోర్ఖా రైఫిల్స్ రెజిమెంట్‌లోనే లెఫ్టినెంట్ జనరల్ చౌహాన్(రిటైర్డ్) పనిచేశారు. భారతీయ సాయుధ దళాలలో అత్యున్నత పదవీ బాధ్యతలను చేపడుతున్నందుకు గర్విస్తున్నానని బాధ్యతల స్వీకారనంతరం నూతన సిడిఎస్ చౌహాన్ తెలిపారు.
సిడిఎస్‌గా త్రివిధ రక్షణ దళాలు తన నుంచి ఆశిస్తున్న కర్తవ్యాన్ని నెరవేర్చడానికి శాయశక్తుల కృషి చేస్తానని ఆయన తెలిపారు. అన్ని సవాళ్లను, ఇబ్బందులను కలసికట్టుగా ఎదుర్కొందామని ఆయన పిలుపునిచ్చారు. తూర్పు ఆర్మీ కమాండర్‌గా పనిచేసిన చౌహాన్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు సైనిక సలహాదారుగా కూడా పనిచేశారు. 2019లో భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై మెరుపు దాడులు జరిపినప్పుడు చౌహాన్ సైన్యానికి చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్(జిడిఎంఓ)గా ఉన్నారు.