50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం
అందుకే హైకమాండ్ ఖర్గేవైపు మొగ్గు చూపిందని విశ్లేషకుల అంచనా
బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చివరి క్షణంలో తెరపైకి వచ్చిన మల్లికార్జున ఖర్గే అన్నీ అనుకున్నట్లుగా జరిగితే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నారు. అదే జరిగితే నిజలింగప్ప తర్వాత కర్నాటకనుంచి ఎఐసిసి అధ్యక్షుడైన రెండో వ్యక్తి అవుతారు. అంతేకాదు జగ్జీవన్ రాం తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన దళిత నేత కూడా అవుతారు. సొంత రాష్ట్రంలో ‘ సోలిల్లద సరదార’( ఓటమిలేని నాయకుడు)గా చిరపరిచితుడైన 80 ఏళ్ల మల్లికార్జున ఖర్గే 50 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం కలిగిన కురువృద్ధుడు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కాంగ్రెస్ పార్టీకే విధేయుడిగా కొనసాగుతూ వస్తున్నారు. అందుకే గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడిగా నిలిచారు. మూడు సార్లు కర్నాటక ముఖ్యమంత్రి పదవిని త్రుటిలో కోల్పోయారు. కొన్ని సామాజిక సమీకరణాల దృష్టా కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను పక్కన పెట్టింది. అలాగని ఆయన ఎన్నడూ సహనం కోల్పోలేదు. పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేయలేదు. ఓపికతో పార్టీనే నమ్ముకుని పని చేశారు. తాజా పరిస్థితుల్లో పార్టీకి కీలక వ్యక్తిగా మారారు.
దళిత వర్గానికి చెందిన ఖరే ్గవిద్యార్థి దశనుంచే నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్నారు.అంచెలంచెలుగా ఎదిగి కలబురిగి (గుల్బర్గా) పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జిల్లాలోని గుర్మిత్కల్ అసెంబ్లీ నియోజకవర్గంనుంచి వరసగా తొమ్మిది సార్లు ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. 1976లో తొలిసారిగా దేవరాజ్ అర్సు ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారీ మంత్రి పదవి ఆయనను వరించింది. 2009లో కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలతో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత రైల్వే మంత్రిత్వ శాఖతో పాటుగా న్యాయశాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు.
2014లో దేశవ్యాప్తంగా వీచిన మోడీ గాలి కారణంగా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. లోక్‌సభలో ఆ పార్టీ బలం కేవలం 44 స్థానాలకు పడిపోయింది. అంతటి ప్రతికూల పరిసితుల్లో కూడా కలబురిగి లోక్‌సభ నియోజకవర్గంనుంచి రెండో సారి గెలిచిన ఖర్గేను పార్టీ అధిష్ఠానం లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా నియమించింది. హిందీలో అనర్గళంగా మాట్లాడగల సత్తా ఉన్న ఖర్గే తన వాక్చాతుర్యంతో అధికార బిజెపిని నిలువరించడానికి ప్రయత్నించే వారు. ‘ మేము 44 మందిమే అయినా.. మహాభారతంలో వంద మంది కౌరవులు పాండవులను నిలువరించలేక పోయారు’ అంటూ బిజెపి ఎంపిలకు చురకలంటించే వారు. అయిదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా పలు ప్రజా సమస్యలను ఎత్తి చూపారు.
అప్పటిదాకా ఓటమే ఎరుగని ఖర్గేను 2019లో తొలి సారి ఓటమి పలకరించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. అయితే ఆయన పనితీరును, సేవలను గుర్తించిన పార్టీ అధిష్ఠానం 2021 ఫిబ్రవరిలో రాజ్యసభకు పంపించింది. కర్నాటకనుంచి ఏకగ్రీవంగా ఎన్నికయిన ఖర్గే అప్పటినుంచి రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. ఖర్గే బౌద్ధమత నియమాలను పాటిప్తారు. సౌమ్యుడు, మృదుస్వభావి, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా హుందాగా వ్యవహరిస్తారు. వివాద రహిత నాయకుడిగా పేరుంది.
కాంగ్రెస్ పార్టీలో 50 ఏళ్లకన్నా ముందు ఎదురైన పరిస్థితులు మళ్లీ పునరావృతమవుతున్న తరుణంలో ఈ సంక్షోభ పరిస్థితులను చక్కదిద్దడానికి గాంధ కుటుంబానికి విధేయుడైన వ్యక్తి అవసరమయ్యారు. దీంతో అన్ని విధాలా సరిపోయిన వ్యక్తి మల్లికార్జున ఖర్గేను అదిష్ఠానం ఎంపిక చేసి బరిలోకి దించిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఒక వేళ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయితే దక్షిణాదినుంచి కాంగ్రెస్‌అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే ఆరో వ్యక్తి అవుతారు. ఇంతకు ముందు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవరెడ్డి, కె. కామరాజ్ , ఎస్ నిజలింగప్ప, పివి నరసింహారావులు పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించారు.