Sunday, December 22, 2024

మహిళకు మహా వరం

- Advertisement -
- Advertisement -

The dollar to rupee exchange rate is Rs. 80

ఆధునికతకు, ప్రజాస్వామ్య వికాసానికి ప్రపంచంలోనే అతి గొప్ప ప్రతీకగా చెప్పుకునే అమెరికా అత్యంత అమానవీయంగా రద్దు చేసిన గర్భ విచ్ఛిత్తి (ఇష్టం లేని కడుపును వదిలించుకొనే) హక్కు మన దేశంలోని మహిళలకు వున్నందుకు గర్వించాలి. తాజాగా మన మహోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ హక్కును పరిపూర్ణంగా అనుభవించడంలో వివాహిత, అవివాహిత స్త్రీల మధ్య గల విభజన రేఖను చెరిపివేసింది. ఈ మేరకు జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం గురువారం నాడిచ్చిన తీర్పు దేశ సామాజిక చరిత్రలో దేదీప్యమాన అధ్యాయాన్ని సృష్టించింది. ఒంటరి మహిళలైన అవివాహితలు, వితంతువులు మినహా ఇతర స్త్రీలందరికీ 24 వారాల గర్భాన్ని కూడా తీయించుకునే హక్కు ప్రస్తుతం వున్నది. అయితే 1971 నాటి వైద్యపరమైన గర్భ విచ్ఛిత్తి చట్టం ఈ అనుమతిని వితంతువులకు, అవివాహితలకు నిరాకరించింది. పెళ్లికాని, భర్తలను కోల్పోయిన స్త్రీలు 51 ఏళ్లుగా అనుభవిస్తున్న ఈ వివక్ష ఈ తీర్పుతో తొలగిపోయింది. స్త్రీకి తన శరీరం మీద సర్వ హక్కులు వున్నాయని, గర్భాన్ని కొనసాగించుకోడమో, వదిలించుకోడమో ఆమె స్వయం నిర్ణయాధికారానికి లోబడి వుంటుందని, ఇందుకు ఆమెకు ఎవరి అనుమతి అక్కర లేదని, ఈ విషయంలో వివాహితలు, అవివాహితలు మధ్య ఎటువంటి తేడా, వివక్ష వుండడానికి వీల్లేదని ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అవివాహితలు, వితంతువులపై ఈ ఆంక్ష ఇంత కాలం వున్నందున ఆ కోవకు చెందిన చాలా మంది ప్రమాదకరమైన గర్భ విచ్ఛిత్తి పద్ధతులను ఆశ్రయించవలసి వస్తుండేది. మన సమాజంలో అవివాహిత మహిళల విషయంలో వున్న నైతిక అవరోధాలు ఇన్నీ అన్నీ కావు. ఆమె ప్రవర్తనకు, ఆ కుటుంబ గౌరవానికి కూడా ముడిపెట్టి చూసే ధోరణి ఇప్పటికీ వున్నది. ఇందువల్ల అవివాహితలు అనుకోకుండా గర్భవతులైతే తరచూ వారికి ఆత్మహత్యే శరణ్యంగా వుంటున్నది. సామాజికమైన అనుమతి లేక వారు పడే క్షోభ ఇంత అంత అని చెప్పడానికి వీల్లేనిది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల వారిలో నైతిక స్థైర్యం, సమాజాన్ని ఎదిరించి నిలిచే ధైర్యం కలుగుతుంది. రాజ్యాంగం 14వ అధికరణ ప్రజలందరికీ ఇతర ఏ విధమైన తేడాలకు ఆస్కారం లేకుండా సర్వసమానత్వాన్ని ప్రసాదించింది. అయితే స్త్రీలకు, అణగారిన వర్గాలకు ఈ సమానత్వం ఇంకా పూర్తి అందుబాటులోకి రాలేదు. అలాగే రాజ్యాంగం 21వ అధికరణ ఎటువంటి తేడాలు లేకుండా పౌరులందరికీ జీవన హక్కును, స్వేచ్ఛను ప్రసాదిస్తున్నది. కాని మన సంప్రదాయ సమాజం ఈ విషయంలోనూ దయలేనిదిగానే వుంది. ఈ హక్కు కొందరికి అందుబాటులో లేకుండా పోతున్నది. అన్ని జీవన రంగాల్లోనూ సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ, జీవన హక్కు వుండాలని రాజ్యాంగం స్పష్టం చేస్తుంటే మహిళలను అవివాహితులని, వివాహితులని, వితంతువులని విభజించి అసమానంగా చూడడం బొత్తిగా సమర్థించదగినది కాదు. తాజా తీర్పు ద్వారా సుప్రీం ధర్మాసనం అదే విషయాన్ని చెప్పింది. అయితే స్త్రీ పురుషుడికి లోబడి నాలుగు గోడల మధ్య బతకడమే భారతీయ ధర్మమని భావించి, ఆ విధంగా బోధించే వారు ఆధిపత్యంలో వున్న చోట, ఖాప్ పంచాయతీలు నడుస్తున్న చోట ఈ హక్కులు అనుభవంలోకి రావడానికి చాలా కాలం పట్టవచ్చు. ఈ తీర్పు ఆ పరిణామాన్ని తొందర చేస్తుంది. అది స్త్రీ సంపూర్ణ వికాసానికి, ఆమె తిరుగులేని స్వేచ్ఛ అనుభవించే పరిస్థితికి దోహదపడుతుంది. ఈ తీర్పులోని ఇంకో గొప్ప విషయం, సంప్రదాయ సమాజాన్ని కుదిపివేసే అంశం వైవాహిక అత్యాచారాన్ని గుర్తించడం. అంటే దాంపత్యంలోని మహిళను ఆమె సమ్మతి లేకుండా భర్త బలవంతంగా కూడడాన్ని, మగ పిల్లలను కనడం కోసం విధిగా ఎన్ని సార్లయినా గర్భవతి అయ్యేలా చూడడం వంటి వాటిని సైతం అత్యాచారంగా గుర్తించవలసి వుందని చెప్పింది. స్త్రీ పెళ్లి చేసుకొని భార్యకావడమంటే భర్తకు అన్ని వేళలా, అన్ని విధాలా దాసిగా బతుకుతూ, అతడి కోర్కెలు తీరుస్తూ వుండడమేననే నిశ్చితాభిప్రాయం మన సంప్రదాయ సమాజానికి ఇప్పటికీ వున్నది. ఇటువంటి నీతులు చెప్పే ప్రవచకులకు మనకు కొదువ లేదు. కాని సమానత్వం, వ్యక్తి స్వేచ్ఛ పరమాశయాలకు ఇది పూర్తి విరుద్ధం. అందుకే వైవాహిక బలవంతపు కలయికను అత్యాచార నేరం పరిధిలోకి తీసుకు రావాలని, దాని ద్వారా సంక్రమించే గర్భాన్ని వదిలించుకునే స్వేచ్ఛ ఆ స్త్రీకి వుంటుందని జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం స్పష్టం చేయడం విప్లవాత్మకమే. వైవాహిక అత్యాచారాన్ని గుర్తించవచ్చునా లేదా అనే విషయం ప్రస్తుతం వేరే సుప్రీం ధర్మాసనం పరిశీలనలో వుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అది విచారణకు వస్తుంది. అప్పుడు వెలువడే తీర్పు మీద ఈ ధర్మాసనం వెలిబుచ్చిన అభిప్రాయం ప్రభావం వుండే అవకాశం కనిపిస్తున్నది. అదే జరిగితే అది నిస్సందేహంగా స్త్రీల పాలిట గొప్ప వరమే అవుతుంది.

Supreme Court extended Abortion right to single women

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News