సౌతాఫ్రికాకు పరీక్ష, నేడు రెండో టి20
గౌహతి: సౌతాఫ్రికాతో ఆదివారం జరిగే రెండో టి20కి ఆతిథ్య భారత్ సమరోత్సాహంతో సిద్ధమైంది. తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి టి20లో ఘన విజయం సాధించిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని తహతహలాడుతోంది. అంతేగాక రెండో టి20లో గెలిచి మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. మరోవైపు సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్ చావో రేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పించి మరో మార్గం లేకుండా పోయింది.
ఇలాంటి స్థితిలో సఫారీ జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఒత్తిడిని తట్టుకుని ఈ మ్యాచ్‌లో గెలవడం పర్యాటక జట్టుకు సవాల్ వంటిదేనని చెప్పక తప్పదు. వరల్డ్‌కప్‌కు ముందు జరుగుతున్న ఈ సిరీస్‌ను ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తొలి టి20లో బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు సయితం టీమిండియా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇక తొలి టి20లో సౌతాఫ్రికా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఒక దశలో 10 పరుగులలోపే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ మ్యాచ్‌లో మాత్రం అలాంటి పొరపాట్లు లేకుండా ముందుకు సాగాలని సౌతాఫ్రికా భావిస్తోంది. మరోవైపు టీమిండియా సిరీసే లక్షంగా మ్యాచ్ బరిలోకి దిగుతోంది.
ఆ ఇద్దరు రాణించాల్సిందే..
తొలి టి20లో విఫలమైన సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో రాణించడం ద్వారా తిరిగి ఫామ్‌ను అందుకోవాలని వారు భావిస్తున్నారు. కీలకమైన ప్రపంచకప్ ముందు వీరిద్దరూ గాడిలో పడాల్సిన అవసరం జట్టుకు నెలకొంది. ఆసియాకప్‌తో పాటు ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో విరాట్ బాగానే ఆడాడు. కానీ సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టి20లో మాత్రం నిరాశ పరిచాడు. అయితే గౌహతి మ్యాచ్‌లో రాణించడం ద్వారా మళ్లీ ఫామ్‌లోకి రావాలని భావిస్తున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇదే లక్షంతో ఉన్నాడు. రోహిత్, విరాట్ తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరిస్తే టీమిండియాకు భారీ స్కోరు ఖాయం.
ఇక మొదటి మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిచిన ఓపెనర్ కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌లు మరోసారి అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. సూర్యకుమార్ ఫామ్‌లో ఉండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఇక తొలి టి20లో సమన్వయంతో ఆడిన రాహుల్ కూడా మరోసారి సత్త చాటేందుకు సిద్ధమయ్యాడు. దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, అశ్విన్, దీపక్ చాహర్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక అర్ష్‌దీప్, అశ్విన్, దీపక్, చాహల్ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
ప్రతీకారం కోసం
మరోవైపు సౌతాఫ్రికా కూడా ఈ మ్యాచ్‌ను సవాల్‌గా తీసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సౌతాఫ్రికా సమతూకంగానే ఉంది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా తొలి టి20లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలని తహతహలాడుతోంది. నోర్జే, రబడా, కేశవ్, షంసి తదితరులతో సౌతాఫ్రికా బౌలింగ్ బలంగా ఉంది. అంతేగాక కెప్టెన్ బవుమా, డికాక్, మిల్లర్, మార్‌క్రామ్, రొసా, పర్నెల్, మహారాజ్‌లతో బ్యాటింగ్ విభాగం కూడా పటిష్టంగానే ఉంది. ఇలాంటి స్థితిలో రెండో టి20 హోరాహోరీగా సాగడం ఖాయం.