Saturday, November 23, 2024

జై భారత్‌

- Advertisement -
- Advertisement -

ప్రపంచానికే దేశం అన్నపూర్ణ

పూల బొకే లాంటి దేశంలో శక్తులు చిచ్చుపెడుతున్నాయి

మన దగ్గర ఉన్నంత
వ్యవసాయ యోగ్య భూమి
అమెరికాలోనూ లేదు
భారత్‌లో 50శాతం
వ్యవసాయ యోగ్యమే..
అమెరికాలో 29%, చైనాలో
16% ఏం లేక మనకీ
దుస్థితి రెంటు లేకనా..
నీళ్లు లేకనా.. వనరులు
లేకనా?
వంచించబడుతున్న దేశం
యువత
అప్రమత్తంగా ఉండాలి
ఇవాళ తిట్లు.. రేపు అవార్డులు
కేంద్ర మంత్రుల తీరిది
ప్రతిమ మెడికల్
కాలేజ్ ప్రారంభోత్సవంలో
ముఖ్యమంత్రి కల్వకుంట్ల
చంద్రశేఖర్ రావు

మన తెలంగాణ/హైదరాబాద్ : పూల బొకేలాంటి దేశం లో కొందరు దుర్మార్గులు తమ స్వార్థ, నీచ రాజకీయాల కోసం విష బీజాలు నాటేందుకు యత్నిస్తున్నారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దేశానికి మంచిది కాదన్నారు. ఇలాంటి చర్యల వల్ల దేశంలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం చాలా గొప్పదన్నారు. ప్రధానంగా సహనశీలత దేశమని, అవసరమైన సందర్భాల్లో త్యాగాలకు సిద్ధపడే దేశమన్నా రు. వరంగల్‌లో ప్రతిమ మెడికల్ కాలేజీని సిఎం కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ, మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు.

ప్రేమతో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోయే భారతదేశంలో విద్వేషాలు రగలొద్దన్నారు. ఏరకంగా సమర్థనీయం కాదన్నారు. ఇలాంటి చర్యలను నియంత్రించడానికి యువత ముందుకు రావాల్సిన అవసరముందన్నారు. యువత మీదే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. తనలాంటి వారి నేతల పని అయిపోయిందన్నారు. ఇప్పటికే 68 ఏండ్లు పూర్తి కావస్తోందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ మీదే….దేశం మీదేనన్నారు. విద్యార్థులుగా, యువకులుగా ఈ దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దుకునే కర్తవ్యం మీ మీద ఉంటందన్నారు. అలాగే మెడికల్ విద్యతో పాటు సామాజిక విద్యను కూడా పెంపొందించుకోవాలన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ముందుకు పోవాలని సూచించారు.

ఇవాళ తిట్టిపోతారు.. రేపే అవార్డులు ఇస్తారు

కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి ఇవాళ తట్టిపోతారు….మళ్లీ ప్రభుత్వ పథకాలు బాగున్నాయని రేపే అవార్డులు ఇస్తారని కెసిఆర్ అన్నారు. ఇక్కడున్న విద్యార్థులకు అన్ని విషయాలు తెలుసు ఈ నవీన సమాచార విప్లవం ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుంది. ప్రతి ఒక్కరూ అద్భుతమైన జ్ఞానాన్ని సముపార్జిస్తున్నారు. తెలంగాణ ప్రజల అండతో ఉద్యమం సాగించి, రాష్ట్రాన్ని సాధించామన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ వన్గా ఉందన్నారు. రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు కేసీఆర్ను మంత్రులను తిట్టిపోతారు. ఇవాళ తిట్టిపోతారు రేపు అవార్డులు ఇస్తారని కెసిఆర్ తెలిపారు. ఉద్యమ సమయంలో చెప్పినవన్నీ ఇవాళ సాకారం అయ్యాయి. తెలంగాణ జీఎస్డీపీ ఎక్కువగా ఉంది. పరిశుభ్రత, పచ్చదనంతో పాటు అనేక రంగాల్లో ముందంజలో ఉన్నాము. తెలంగాణ ప్రజల్లో అద్భుతమైన చైతన్యం ఉంది. అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు పని చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.

ప్రపంచానికే అన్నపూర్ణ భారతదేశం

ప్రపంచానికే అన్నపూర్ణ భారత అని కెసిఆర్ అన్నారు. మన దేశంలో ఉన్న సంపదలు ప్రపంచంలోనే మరే దేశంలో లేవన్నారు. మనకంటే మూడు రెట్లు ఉండే అమెరికాలో కూడా వ్యవసాయానికి అనుకూలమైన భూమి కేవలం 29శాతమే ఉందన్నారు. మనకంటే రెండింతలుండే చైనాలో కూడా కేవలం 16 శాతమే వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉందన్నారు. కానీ మన భారతదేశం విస్తరించి ఉన్న భూభాగం 83 కోట్ల ఎకరాల్లో.. అందులో 50శాతం అంటే 41 కోట్ల ఎకరాల వ్యవసాయానికి అనుకూలంగా ఉందన్నారు. అద్భుతంగా వ్యవసాయానికి అనుకూలమైన వాతావరణ (ఎక్సలెంట్ ఆగ్రో క్లైమేటిక్ కండిషన్స్) పరిస్థితులున్నవన్నారు. అంతేకాదు టిపికల్ మిక్స్ ఆఫ్ లాండ్స్.. నల్లనేలలు, ఎర్ర నేలలు, ఇసుక నేలలు, తేలికపాటి నేలలున్నవన్నారు. వీటితో పాటు నదులలో ప్రవహించే 70 వేల టిఎంసిల నీళ్లున్నవని..ఇన్ని వనరులు, వసతులున్న ఈ దేశంలో మనం మెక్ డోనాల్డ్, బర్గర్లు తింటున్నామన్నారు.

ప్రపంచానికే ఆహారాన్నిందించే భారతదేశం ప్రస్తుతం వంచించబడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో వేల మంది రైతులు 13 నెలలకు పైగా ధర్నాలు చేసే పరిస్థితి తలెత్తిన విషయాన్ని ఈ సందర్భంగా సిఎం గుర్తు చేశారు. ఏం లేక మనకీ దుస్థితి అని ప్రశ్నించారు. కరెంటు లేకనా, నీళ్లు లేకనా, వనరులు లేకనా? అని అన్నారు. 1 కోటి 40 లక్షల జనాభా లేకనా, పనిచేసే యువశక్తి లేకనా? అని నిలదీశారు. ఈ దేశం నాది అని భావించే వాళ్లం ఎప్పటికప్పుడు ఈ విషయాలు తెలుసుకోవాలన్నారు. మన చుట్టూ ఏం జరుగుతుందో పరికించి చూడాలన్నారు.. దాన్ని సంస్కరించడానికి, మంచి చేయడానికి మనవంతు కృషి చేయాలన్నారు

ముంబై కంటే మన తలసరి ఆదాయమే ఎక్కువ

రాష్ట్రంపై మోడీ సర్కార్ వివక్ష చూపిస్తుందని కెసిఆర్ మండిపడ్డారు. అయినా అన్ని రంగాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉందన్నారు. . దేశ వాణిజ్య రాజధాని ముంబై కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందన్నారు. ఉద్యమ సమయంలో చెప్పిన మాటలన్ని నిజం అవుతున్నాయన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కొందరు చిల్లరగా మాట్లాడుతూ దేశంలో మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని కెసిఆర్ విమర్శించారు. 1956లో జరిగిన చిన్న పొరపాటు వల్ల 60 ఏండ్లు గోస పడ్డామన్నారు. అందువల్ల అలాంటి ఘటనలకు మరోసారి తావివ్వకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.

ధనిక రాష్ట్రంగా తెలంగాణ

దేశంలోనే ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఉంటదని తాను గతంలో పలుమార్లు చెప్పానని…. ప్రస్తుతం అదే జరుగుతున్నదని కెసిఆర్ అన్నారు. అద్భుతమైన విజయం ఏందంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబై రాజధానిగా ఉన్న మహారాష్ట్ర కంటే మన తెలంగాణ పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఎక్కువ అని అన్నారు. జిఎస్‌డిపి గ్రోత్ ఎక్కువ….పర్ క్యాపిటా పవర్ యుటిలైజేషన్ ఎక్కువ అన్ని పరిశుభ్రతలో, పచ్చదనంలో, హరితహారం ఇలా ఏ రంగాల్లో తీసుకున్నా తెలంగాణ రాష్ట్రమే అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు.

ప్రతి ఒక్కరికి హెల్త్ ఫ్రొఫైల్

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని సంకల్పించామని కెసిఆర్ అన్నారు. ఇందులో తాము కూడా భాగస్వాములమవుతం అని చెప్పిన ప్రతిమ శ్రీనివాసరావుకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రయోగాత్మకంగా సిరిసిల్ల, ములుగులో 100శాతం హెల్త్ ప్రొఫైల్ తయారు చేశామన్నారు. ప్రతివ్యక్తి బ్లడ్ గ్రూపు, ఆరోగ్య మంచిచెడ్డలన్నీ రికార్డు చేసి, కంప్యూటరైజ్ చేయడం జరిగిందన్నారు. ఆ వ్యక్తికి ఏ రకమైన జబ్బు వచ్చినా…. ఏదైనా ప్రమాదం జరిగినా ఆపత్కాలంలో ఒక నిమిషంలోనే ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా తెలుసుకునే ఆస్కారం ఉంటందన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు పూర్తయితే.. ఏ వ్యక్తికి ఏరకమైన ఆరోగ్య సమస్య వచ్చిన నిమిషంలోనే వారి ఆరోగ్యస్థితి తెల్సుకోవచ్చునని అన్నారు. దీంతో ప్రజలకు అవసరమైన వైద్యసేవలను డాక్టర్లు క్షణాల్లో అందిస్తారన్నారు. ప్రాణాలను సకాలంలో కాపాడుతారన్నారు. కాగా ములుగు అటవీ ప్రాంతంలో డయాలసిస్ సేవలు కూడా అందుబాటులోకి తెస్తున్నామన్నారు.

హైదరాబాద్‌ను మించిన సూపర్ స్పెషాలిటి హాస్పిటల్

వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల ప్రజల కోసం హైదరాబాద్ ను మించిన 2వేల పడకలతో 24 అంతస్తుల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణమవుతున్నదని కెసిఆర్ అన్నారు. వరంగల్ వాళ్లు హైదరాబాద్ కు వెళ్లడం కాదు.. హైదరాబాద్ వాళ్లే వరంగల్ కు వచ్చేలాగా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటందన్నారు. ఆర్ అండ్ బి, ఆరోగ్య మంత్రులు దీన్ని త్వరగా పూర్తి చేయించాలని సూచించారు.

ప్రస్తుతం వరంగల్లోనే రాష్ట్ర హెల్త్ యూనివర్సిటీని కూడా పెట్టుకున్నామని, మన పురోగమనం ముందుకు సాగాలంటే, సమాజం చైతన్యవంతంగా ఉండాలన్నారు. మేధావులు ముందుండి చైతన్యం చేస్తేనే ఆ సమాజం ముందుకు పోతుందన్నారు. మంత్రులు తన్నీరు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, పసునూరి దయాకర్, ప్రతిమ గ్రూపు సంస్థల చైర్మన్ బోయినిపల్లి శ్రీనివాస్ రావు, ఎంఎల్‌సిలు కడియం శ్రీహరి, మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, డాక్టర్ బండా ప్రకాశ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నవీన్ కుమార్, పాడి కౌశిక్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, వొడితెల సతీష్ కుమార్, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, డాక్టర్ టి.రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News