Monday, December 23, 2024

మేరువు కన్నా ధీరుడు

- Advertisement -
- Advertisement -

Gandhi Jayanti 2022

“…హిమాలయాలను గురించి, గంభీర సముద్రాలను గురించి సమగ్రంగా చెప్పగలగడం ఎంత అసాధ్యమో, మహాత్మాగాంధీ వ్యక్తిత్వాన్ని గురించి చెప్పగలగడం కూడా అంత అసాధ్యం… అని మహాకవి దాశరథి కృష్ణమాచార్యులంటే; కవి తిలకుడు దేవరకొండ బాలగంగాధర తిలక్, గాంధీని మన నుండి, మన అనుభవ పరిమాణాన్నుండి విడిగా చూడటం కష్టం. మనలో సున్నితంగా ఆవరించుకున్న చైతన్యం అంతటా గాంధీ స్పృహ నీరవంగా ఉంది. గాంధీని విడదీసి భారతదేశాన్ని చూస్తే దేశం అంతా కొత్తగా, మనది కాదన్నట్టుగా కనిపిస్తుంది చెబుతారు! అంతేకాదు తిలక్ ఇంకా ఇలా అంటా రు సత్యమూ, అహింసా అన్న ఈ రెండు ఆదర్శాలూ గాంధీజీ కొత్తగా ప్రవచించినవి కావు. ఉత్తమాటలుగా చప్పబడిపోయిన వీటికి మళ్ళీ కొన్ని వేల వోల్టుల చైతన్యాన్ని కలిగించాడు!!

పాత విషయాలను కొత్తగా చూడటం, విలక్షణంగా పాటించడం గాంధీజీ విధానం కావచ్చును. ‘గాంధీజీ నూరేళ్ళు’ అనే శత జయంతి సంపుటానికి ఉపోద్ఘాతం రాస్తూ తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణయ్య దేశభక్తి భావన గురించి గాంధీజీ ఎలా వివరిస్తారో అంటూ ఆయన మాటలనే మన ముందుంచుతారు… ఇతర దేశాలకు కష్ట నష్టాలు కలిగించే పద్ధతిలో స్వాతంత్య్రాన్ని కోరడం లేదని… అని గాంధీజీ 1925 ఆగస్టు 18న కలకత్తా రోటరీ క్లబ్‌లో అంటూ ఇలా వ్యాఖ్యానించారు, భారత దేశపు స్వాతంత్య్రం వల్ల బ్రిటన్ ఉనికికే ప్రమాదమైతే బ్రిటీషు ప్రజలు వినాశన పద్ధతిని ఎదుర్కోవలసి వచ్చే పక్షంలో అట్టి స్వాతంత్య్రం నాకక్కరలేదు… కాబట్టి జాతీయవాదం అనగా నా దృష్టిలో ప్రత్యేకమైనది…! ఇటువంటి విభిన్నమైన ఆలోచనలు మామూలుగా ఆలోచించే వారికి సులువుగా బోధపడవు. మన దేశంలో 2019 సంవత్సరం చివర్లో కామన్ సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ ఆక్ట్ గురించి పెద్ద ఎత్తున చర్చ వచ్చినపుడు అన్ని రకాల ఆలోచనలున్న వారికీ గాంధీజీ నమ్మదగ్గ ఛాయలా భాసించారు.

గాంధీజీ కనుమూశాక ప్రఖ్యాత రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మ ఒక విశ్లేషణాత్మక వ్యాసం రాస్తూ 1948 ఆగస్టులో ఇలా అన్నారు. ప్రథమ భారత ప్రభుత్వాధ్యక్ష పదవికి ఒక స్త్రీ ముఖ్యంగా తాను ఆద్యంతంగా అభ్యుదయం కోరే ఒక హరిజన యువతి రావాలని కోరాడు. మరి ఇంత విభిన్నంగా ఆలోచించే గాంధీజీ వ్యక్తిగా ఏ రకంగా ప్రత్యేకం? దీనికి కవిత్వ వైతాళికులు దేవులపల్లి కృష్ణశాస్త్రి ఇలా వివరిస్తారు తన విశ్లేషణ, ఈయన మన కళ్ళు మిరుమిట్లు గొలుపడు. ఈయన కైలాస శిఖరం కాదు. దేశం అంత జలాశయం గాంధీ. గాంధీ గంగానది… దానిలో అమృతం మీకూ, నాకూ అందరికీ అహరహమూ అన్ని పనులకూ అందుబాటులో ఉంటుంది… అని. దీనికి వివరణ అన్నట్టుగా త్రిపురనేని గోపీచంద్ తన ‘గాంధీ తత్వం’ అనే వ్యాసం లో ఇలా అంటారు. ఆయన దృష్టి పూర్తిగా మన పూర్వ సంస్కారాన్ని పునాదిగా పెరిగిన దృష్టి… మానవునిలో మంచితనం ఉంది. ఎప్పుడూ ఉంటుం ది… కానీ విభిన్న కారణాల వల్ల అది మరుగునపడి ఉంది… ఆ మరుగును తొలగిస్తే, మానవుడు తన పరిస్థితుల్ని అధిగమించి ప్రవర్తించ గలుగుతాడు అని.

దేవరకొండ బాలగంగాధర తిలక్ అభిప్రాయం ఏమిటంటే -గాంధీజీ స్వభావానికి, అభిప్రాయాలకి విభిన్నులైన వారు కూడా గాంధీజీలోని ఒక ఆకర్షణకి, ఒక బలీయమైన శక్తికి లోబడిపోయారు. మతమూ, వేదాంతమూ అంటే చిరాకు; సైన్స్, సామ్యవాదమూ అంటే అభిమానం కల నెహ్రూ పండితుడు తన రచనల్లో గాంధీ ప్రసక్తి వచ్చినపుడల్లా కావ్యత్వం సిద్ధించే భావౌన్నత్యాన్నీ, రామణీయకతనీ ప్రదర్శించారు అని! కొడవటిగంటి కుటుంబరావు అయితే గాంధీజీ హత్య గురించి 1948 ఫిబ్రవరి- మార్చి సంచిక ‘ ఆంధ్ర మహిళ’ పత్రికలో రాసిన ఇలా వ్యాఖ్యానిస్తారు. అధర్మ ప్రబలి ధర్మచ్యుతి జరిగినపుడు అవతార పురుషుడు జన్మించి దుష్టులను శిక్షించి, శిష్ట రక్షణ చేస్తారనేది కల్ల. కృష్ణుడు నీచ కిరాతకుడి చేతిలో చచ్చాడు. గాంధీజీని చంపటానికి మరొక పరమ కిరాతకుడు కావాల్సి వచ్చింది. తనను నాశనం చేసిన అధర్మం ఎటువంటిదో ప్రజలకు చూపటానికే అవతార పురుషులు ఉపకరిస్తారు. గాంధీజీ మనకు తన మృతి ద్వారా హిందూ మతావేశకుల నగ్న స్వరూపం చూపగలిగారు.

మరి అంత ప్రత్యేకమైన గాంధీజీని ఎలా అర్థం చేసుకోవడం? తిలక్ ఇలా అంటారు అదే అసంపూర్ణ వ్యాసం (కళాకేళి, 1969 సెప్టెంబర్- అక్టోబరు సంచిక) లో, … గాంధీజీ తాను చెప్పిన దాని కన్నా చేసి దాని కన్నా గొప్పవాడు. ఒక మహా వ్యక్తి ప్రభావాలు అతని మాటలలోనే చూడాలనుకోవడం చెట్లమీదా, ఇళ్ళ మీదా పడిన సూర్యకాంతిని బుట్టలలోకి ఎక్కించి దాచాలనే ప్రయత్నం లాంటిది అని. దాశరథి కృష్ణమాచార్య, దేవరకొండ బాలగంగాధర తిలక్, కనుపర్తి వరలక్ష్మమ్మ, త్రిపురనేని గోపీచంద్, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు వంటి సాహితీ పండితుల అభిప్రాయాలు చూశాక, మహా కవి శ్రీశ్రీ ఏమని ఉంటారో కదా అని మీకనిపిస్తూ ఉంటుంది. ఆయన ఆయన బాణిలో ఇలా అంటారు..
అతడు సామాన్య వ్యక్తి
అతడసామాన్య వ్యక్తి
తృణం కన్నా తేలిక
మేరువు కన్నా ధీరుడు
అతడిప్పుడు లేడు
అతడెప్పుడూ ఉన్నాడు

డా. నాగసూరి వేణుగోపాల్- (ఆకాశవాణి పూర్వ సంచాలకులు)- 9440732392

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News