మలంగ్: ఇండోనేషియాలో ఫుట్‌బాల్ మైదానంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 125మంది చనిపోయారు. శనివారం రాత్రి ఘటన చోటు చేసుకున్న అనంతరం 127 మంది చనిపోయినట్లు ప్రకటించగా ఆదివారం మధ్యాహ్నానికి ఆ సంఖ్య 174కు చేరుకుందని అధికారులు తెలిపారు. అయితే మృతుల్లో కొంతమందిని రెండు సార్లు లెక్కించడం వల్ల పొరబాటున మృతుల సంఖ్య 174గా పేర్కొడం జరిగిందని, వాస్తవంగా ఇది 125 మాత్రమేనని తాజాగా వివరణ ఇచ్చారు. తూర్పు జావా ప్రావిన్స్‌లోని మలంగ్‌లో శనివారం నిర్వహించిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మరో 100 మందికి పైగా ఐసియులో చికిత్స పొందుతుండగా వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు ప్రటించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యక్రమాల్లో ఇప్పటివరకు చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇదే అత్యంత దారుణమైనదిగా భావిస్తున్నారు.
అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య( ఫిఫా) అధ్యక్షుడు గియాన్ని ఇన్‌ఫాంటినే ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల తరఫున తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఈ దుర్ఘటనతో ఫుట్‌బాల్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురయిందన్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తూర్పు జావా మలాంగ్ సిటీకి చెందిన అరెమా ఫుట్‌బాల్ క్లబ్ జట్టు పెర్సెబాయ సురబాయ జట్టు చేతిలో ఓడిపోయింది. తమ జట్టు ఓడిపోవడంతో ఆగ్రహించిన అరెమా జట్టు అభిమానులు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు, ఫుట్‌బాల్ అధికారులపై బాటిళ్లు, ఇతర వస్తువులు విసిరేయడం ప్రారంభించారు. అంతేకాకుండా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లపైనా దాడి చేశారు. అభిమానులు కంజురుహాన్ స్టేడియం మైదానంలోకి దూసుకు పోయి 23 ఏళ్ల పాటు స్థానికంగా జరిగిన మ్యాచ్‌లలో ఓడిపోని అరెమా జట్టు ఎందుకు ఇప్పుడు ఓడిపోయిందో జట్టు మేనేజ్‌మెంట్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇరు జట్ల అభిమానుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువును ప్రయోగించడంతో పాటుగా లాఠీచార్జి చేశారు. దీంతో భయాందోళనలకు గురయిన ప్రేక్షకులు ఒక్కసారిగా బయటకు వెళ్లడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
అయితే స్టేడియంలో ఎటువంటి అల్లర్లు జరగలేదని, పోలీసులు ఎందుకు టియర్‌గ్యాస్ ప్రయోగించారో అర్థం కావడం లేదని కొందరు ప్రేక్షకులు అంటున్నారు. మహిళలు, పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా భద్రతా సిబ్బంది దారుణంగా వ్యవహరించారని వారు వాపోయారు. ఫుట్‌బాల్ స్టేడియంలలో భాష్పవాయువును ప్రయోగించడాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ( ఫిఫా)కూడా నిషేధించింది. అయితే అభిమానులు పోలీసులపైన దాడి చేయడం, అనాగరికంగా ప్రవర్తించడం, వాహనాలను తగులబెట్టడం ప్రారంభించినందువల్లనే తాము భాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చిందని తూర్పు జావా పోలీసు చీఫ్ నికో అఫింటా విలేఖరులకు చెప్పారు. కొంతమంది ఊపిరి ఆడక మృతి చెందగా, మరికొంత మంది తొక్కిసలాటలో చనిపోయినట్లు ఆయన తెలిపారు. గాయపడిన 300కి పైగా జనాన్ని దగ్గర్లోని ఆస్పత్రులకు హుటాహుటిన తరలించామని, అయితే చాలా మంది దారిలో, చికిత్స పొందుతుండగా చనిపోయారని ఆయన తెలిపారు. స్టేడియం సామర్థం 42 వేల కాగా మొత్తం టికెట్లు అమ్ముడు పోయినట్లు అధికారులు చెప్పారు.
ఘటన సమయంలో దాదాపు 3 వేల మంది స్టేడియంలోకి చొచ్చుకు వచ్చారని, వారిని అదుపు చేసేందుకే టియర్‌గ్యాస్ ప్రయోగించినట్లు పోలీసులు చెప్పారు. అల్లరు స్టేడియం బైటికి కూడా విస్తరించడంతో ఆందోళనకారులు అయిదు పోలీసు వాహనాలను తగులబెట్టారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో .. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంతవరకు ఎలాంటి మ్యాచ్‌లు నిర్వహించవద్దని ఇండోనేషియా ఫుట్‌బాల్ అసోసియేషన్ పిఎస్‌ఎస్‌ఐని ఆయన ఆదేశించారు. ఇండోనేషియా వచ్చే ఏడాది మే 20నుంచి జూన్ 11 వరకు ఫిఫా అండర్20 వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యం మశించనుంది. ఆతిథ్య దేశంగా అది ఆటోమేటిగ్గా ఈ పోటీలకు క్వాలిఫై అయింది.