గాంధీకి, బసవేశ్వరుడికి అనేక పోలికలు ఉన్నాయి
ప్రజలకు ప్రజాస్వామ్య పద్ధతిని నేర్పిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడు
ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్: గాంధీకి, బసవేశ్వరుడికి అనేక పోలికలు ఉన్నాయని.. విద్య, సమాజం, సమానత్వం గురించి పోరాటం చేశారని, ప్రజలకు ప్రజాస్వామ్య పద్ధతిని నేర్పిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన గొప్ప తనాన్ని గుర్తించిందన్నారు. కోకాపేట్‌లో రూ.10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే బసవేశ్వర ఆత్మగౌరవ భవనానికి ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డీసిసిబి చైర్మన్ మల్కాపురం శివకుమార్, టిడిసి చైర్మన్ ఉమాకాంత పాటిల్, బసవ సమన్వయ కమిటీ ప్రతినిధులు, లింగాయత్ సమాజం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ బసవేశ్వరుడి జయంతిని అధికారికంగా జరపాలని ఎన్ని దరఖాస్తులు పెట్టినా గత పాలకులు పట్టించుకోలేదన్నారు. సిఎం కెసిఆర్‌ను బిబి పాటిల్ కలవగానే ట్యాంక్ బండ్‌పై బసవేశ్వరుడి విగ్రహాన్ని పెట్టారని, బసవేశ్వర జయంతిని అధికారికంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి హరీష్‌రావు తెలిపారు.
లింగాయత్ సమాజాన్ని ఓబీసిలో చేర్చాలని తీర్మానం
రాష్ట్ర ప్రభుత్వం లింగాయత్ సమాజానికి అనేక అవకాశాలు కల్పించిందన్నారు. లండన్‌లో పార్లమెంట్ ఎదుట బసవేశ్వరుడి విగ్రహం చూశానని, ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఉన్నారని, బ్రిటిష్ ప్రధాని ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లింగాయత్ సమాజాన్ని ఓబీసిలో చేర్చాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని ఆయన తెలిపారు. జహీరాబాద్, జోగిపేట, సంగారెడ్డి ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టుకు బసవేశ్వర అనే పేరును పెట్టామని అది మా చిత్తశుద్ధికి నిదర్శమన్నారు.
మనమందరం సమానమే: స్పీకర్
కులం లేదు, మతం లేదు మనమందరం సమానమే అని నినదించిన వ్యక్తి బసవేశ్వరుడని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఉపన్యాసాలకు పరిమితం కావొద్దని ఆయన్ను ఆదర్శంగా తీసుకొని కుల, మతాలకు అతీతంగా ఉండాలని ఆయన సూచించారు. మనం ఎంతో నేర్చుకునేది ఉందని, బసవేశ్వరుడి ఆధ్వర్యంలో ఆనాడే కులాంతర వివాహాలు జరిగాయని ఆయన తెలిపారు. మనుషులందరూ ఒక్కటే, కులాలు లేవు, ఉప కులాలు లేవని స్పీకర్ పేర్కొన్నారు.
Harish Rao lays foundation stone to Basaveshwara Bhavan