తెలంగాణ యాస భాషపై ఎగతాళి చేసినవారే నోరెల్లబెట్టేలా ఈ ప్రాంత కవులకు విస్తృతమైన గౌరవం లభించే విధంగా పురస్కారాలు ఇచ్చి కొత్త కవులను వారి సాహిత్య సృజనను ప్రభుత్వం ప్రోత్సహించటం గొప్ప విషయం. దశాబ్ధాల కాలం నాటి స్వరాష్ట్ర కాంక్ష నెరవేరటం చరిత్రాత్మకమైన విషయం. తెలంగాణ సాహిత్య చరిత్రను మదింపు చేసి ఒక రూపును తెచ్చిన ఘనత డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డికే దక్కుతుంది. ఈతరం కవులకు మార్గదర్శకులు, మాకన్నా ముందు తరం కవులలో ముందు వరసలో ఉండేవారిలో సుంకిరెడ్డి కూడా ఎన్నదగిన వ్యక్తి అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. వారి కలం నుండి జాలువారిన తావు కావ్యాన్ని చదివిన తర్వాత ఒక పరిపూర్ణమైన సాహిత్యాన్ని సంపూర్ణమైన సాహిత్య మూర్తిమత్వం మూర్తీ భవించిన కవి గూర్చి నాలుగు మాటలు వ్రాయకపోతే ఏదో తప్పు చేశాననే భావన నన్ను జీవితాంతం వెంటాడుతుంది.
రాచకన్యల చనుదోయి మధ్య/ ముత్యాల జాలు వోలె / రెండుబోళ్ళ మధ్యనుంచి సక్కదనంగ/ పారేది మా వాగు/ గుత్తేదార్లకు వాగు ఉత్తవేలం కుప్ప/ నగరాలకు తరలించే పైసల కుప్ప/ పైసాశ ఎవడు నేర్పెనో గాని/ ఉశిక బాయె/ ఉశికెంట నీళ్ళు బాయె /నీళ్ళెంట శెట్టు బాయె / శెట్టెంట పచ్చిబాయె /పచ్చెంట పావురంబాయె / వాగిప్పుడు వట్టి కష్టాలగడ్డ/ యవ్వనమంత తాగేస్తే / వెళ్ళాడిన తొడలు నీర్జీవమైన చేతులు / బొక్కల పోగాయె మా వాగు/ పై కవితలోని వాక్యాలు వాగు శ్రీర్షికతో వున్న కవితలోనివి. ప్రస్తుతం పల్లెటూర్ల వెంట వున్న నిర్జీవమైన వాగులకు ప్రత్యక్ష, అక్షర సత్యాలు ఈ వాక్యాలు. సుంకిరెడ్డి ఊరిలోని వాగు, వాగుతో కూడిన బాల్యపు జ్ఞాపకాలు, దానిపై ఆధారపడి జీవించే కుటుంబాల గూర్చి వివరించారు ఈ కవితలో. ఈ కవితను చదివితే నాకు మా ఊరు సరిహద్దుల వెంబడి ప్రవహించే మూసీ నది గుర్తుకు వచ్చినది, ఈ మధ్య కాలంలో నేను ఊరికి వెళ్ళినప్పుడు వాగు దగ్గర విశ్రాంతి కోసం వెళ్ళి చూడగా మనిషి ఎముకల గూడు మాదిరి కనిపించింది. ఇసుక చీకటి దందాకి అత్యాచారం చేయబడి నిస్సహాయస్థితిలో బిక్కుబిక్కుమంటున్న యువతివలె కనిపించింది. సంవత్సరమంతా ప్రవహించే వాగు గుత్తేదార్లు వేలంపాట ద్వారా చేజిక్కించుకొని ఇసుకను చివరికంతా తోడేసుకొని నగరాలకు తరలించి కోటీశ్వరులుగా మారుతున్న తీరు కళ్ళకు కట్టినట్లు అక్షరబద్దం చేశారు. వాగుపై ఆధారపడి వుండే పొలాలు వాగు వెంటవుండే పచ్చని చెట్టు, ఆ చెట్లపై ఆధారపడి జీవించే పక్షులు నేడు వాగు కాష్టలగడ్డ మాదిరిగా కనిపిస్తున్నట్లు ఒక వాస్తవిక సన్నివేశాన్ని కళ్ళముందుoచారు పై కవితలో.
సత్యమెప్పుడూ ఒంటరే / దిగిన బాకుకు దెల్వదుగని / పొడిచిన చేయికి తెలుసు /వాడిన బాషకు దెల్వదుగని/ రాసిన కలానికి తెలుసు /కొలిమిలో పడినంక/మాలిన్యమో మేలిమో తేలిపోతుంది /సత్యమెప్పుడూ ఒంటరిదే/రెమ్మలురాలిపోని /కొమ్మలు ఎండిపోనీ /కాసేపు గుబులు/ ఎక్కడ రాల్చుకోవాలో /ఎక్కడ బిగిర్సాలో /దానికి తెలుసు/నిజానికి /సత్యం ఒంటరిదేమీ కాదు/ ఒం టరి శీర్షికతో వున్న కవితలోనివి ఈ వాస్తవికమైన వాక్యాలు. ఇది చదవగానే నాకు టక్కున గుర్తొచ్చిన సామెత యదార్ధవాది లోక విరోధి అన్నది. ఈ కవిత కూడా దానిని అనుసరించే విధంగానే ఉన్నది. ప్రస్తుత సమాజంలో ఎక్కువ మంది అలా నటిస్తున్నట్లుగానే కన్పిస్తారు మనకు చాలా చోట్ల. అలానే తేనెపూసిన కత్తి, మేక వన్నేపులి, నివురు గప్పిన నిప్పు మొదలైన జాతీయాలు ఈ సందర్భంగా గుర్తు చేయాలి. వెన్నెపోటుదారుడు పక్కనే వుంటే పసిగట్టడం కష్టం కపట ప్రేమను ప్రదర్శిస్తూ నిజాయితీ పరుడిగా నటించటం కొందరికి పుట్టుకతో వచ్చే కళ అది అందరికి సాధ్యం కాదు.
నిజానికి సత్యం ఒంటరిది అనుకుంటాం గాని ఆలస్యంగానైనా దాని విలువ ఏమిటో తప్పకుండా అందరికి తెలుస్తుంది. కొలిమిలో పడితేగాని నిజమైనదేదో నకిలీది ఎదో గాని తెలవదు అలానే సంఘర్శించుకోకపోతే సత్యం ఎదో అసత్యం ఎదో తెలవదు అంటారు ఈ కవితలో మంచి సందేశం ఇచ్చే కవిత ఇది.
మీ బాట్ల ఎత్తుల్లో పాసంగం కోల్పోయిన వాణ్ణి /మీ కాంటా సిరిమానుకు వేలాడుతున్న వెన్నెముకను /కోండ్రలు లెక్కబెట్టి నేర్చుకున్న ఒకటి రెండ్లు /మీ క్యాలిక్యులేటర్ల మాయలో సున్నాలవుతున్నాయి / పెయి మీద బట్టలేక కూరటికిల నూనెలేక /గింజల్ని దయలేమనే గదరా /మా కల్లాలు కళకళ్ళాడగానే /ధరల చీటీ పాతాళానికి పడేసేది?/పిర్రలు కరగకుండా పైసలకు పీటముడి వేసే / ఈ తెలివెక్కడిదిరా?/ మట్టి పెళ్లలు నా అరిచేతుల్లో కాయలు గాస్తేనే / మీ చేతులు రాతలు నేర్చింది. /రోల్లు పగిలే రోణి కార్తెండలో నేను తుక తుక ఉడికితేనే /నీడపట్టున మీరు కౌటిల్యులయ్యింది?/ పైన ఉదాహరించినవి కాంటా శీర్షికతో ఉన్న కవితలోనివి వాక్యాలు. అమాయకుడు ఉన్నంత కాలం ఆధిపత్యం చెలాయించేవాడు మరియు అజమాయిషీ చేసే వాడు ఉంటాడనేది చరిత్ర చెప్పిన సత్యమే. టమాట పండించిన రైతు సరుకు అమ్మడానికి మార్కెట్ కి తీసుకొని వస్తే గిట్టుబాటు ధర రాక పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతే ఎంత నిరాశ, ఎంత ఉద్వేగం అవుతాడో నేను కళ్ళారా చూసిన వాడిని స్వయానా మా నాన్న రైతు కావటం ఇక్కడ ప్రస్తావనార్హం, పంట కోత సమయాలలో ఊర్లలో ఒక రకమైన పండగ వాతావరణం ఉండేది. పంట చేతికొచ్చేదాకా కళ్ళలో వత్తులేసుకొని వచ్చిన పంటను జాగ్రత్తగా మార్కెట్కు తరలిస్తే రైతుకు జరిగే దోపిడి మాటల్లో వర్ణించలేనిది. దేశానికి తిండిపెట్టి తను పస్తులుంటాడు. చిరిగిన బట్టలు, చింపిరి జుట్టు అర్ధాకలి జీవితం. రైతు కుటుంబం ఎప్పుడు పేదరికంలో వుంటే పండించిన పంటను కొనుగోలు చేసిన దళారి కోట్లకు పడగలెత్తుతడు ఇది నేటికి అక్షర సత్యం. రైతు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పంట చేతికి రాగానే ధరల పట్టి పాతాళానికి పడేస్తరు. ఎలాగు పండిన పంటను దాయలేడు, అమ్మక తప్పని పరిస్థితి, దాస్తే సరుకు పాడైపొతుందని బెంగ, నేటికి రైతులు పండించిన పంటను మార్కెట్ లోనే వదిలివేసి వెళ్ళటం లేదా నిప్పు పెట్టడం, పశువులకు వదిలిపెట్టడం చూస్తూనే వున్నాం. ఇంత దయనీయమైన పరిస్థితి నేటి రైతుది. రైతు యొక్క గోడును వేధనను ఆవేదనను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు ఈ కవితలో సుంకిరెడ్డి .
గాలి వీస్తున్నది /పండుటాకులు పడిపోవాలె గాని /పుప్పొడులు రాలుతున్నవి /ప్రవాహం ప్రళయమవుతున్నది/ ముసలి వృక్షాలు మట్టిల కలవాలె గాని /గరక పోసలు అవిసిపోతున్నవి. /వాళ్ళది రక్తదాహ చరిత్ర /మాది రక్త తర్పణ చరిత్ర/ తెల్లోళ్లలా ఆక్రమణ చరిత్ర వారిది /సమ్మక్కలా ధిక్కార చరిత్ర మాది /జర వాళ్లకు చెప్పు/ మాది కడుపు మంట అని చెప్పు /కృష్ణవేణి శీర్షికతో వున్న కవితలోనివి పై వాక్యాలు.. ఇందులో తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతము మధ్యవారధిగా ప్రవహిస్తున్న కృష్ణానదికి తన గోడును వెళ్ళబోసుకుంటున్నట్లుగా తెలంగాణ ప్రాంతపు బాధిత వ్యక్తిగా వాస్తవిక దృశ్యాన్ని అక్షరబద్ధం చేశారు. భౌగోళికంగా కృష్ణానది మహారాష్ట్రలో జన్మించినా తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ మొత్తంలో ప్రవహించి ఆంధ్ర ప్రాంతం వైపుగా పయనించి సముద్రంలో కలుస్తుంది. నదీ ప్రవాహం మనతోనే ప్రారంభమైతే లబ్ధిపొందేది మాత్రం ఆంధ్ర ప్రాంతం వారు. అక్రమంగా నీటిని వాడుకొని మనప్రాంత ప్రజల్ని మన నీటి అవసరాల్ని పక్కన పెట్టి ఎక్కువ మొత్తంలో లబ్దిపొందేది ఆంధ్ర ప్రాంతం వారు, బీడు భూములు మనకు సాగు భూములు వారికి వీస్తున్న గాలికి పండుటాకులు పడిపోవాలే గాని పువ్వుగా మారటానికి, ఉపయోగపడే పుప్పొడిరాలి చెట్టు యొక్క పతనం మరియు దాని తర్వాత తరం లేకుండా అవుతుంది అంటూనే. ప్రవాహం ప్రళయం అవుతుంది. ముసలి వృక్షాలు మట్టిల కలవాలే గాని దేనికి పనికిరాని గరకపోసలు అలిసిపోతున్నాయ్, వాళ్ళది (ఆంధ్ర ప్రాంతం వారిది) రక్తదాహ చరిత్ర, మనది (తెలంగాణ ప్రాంతం) రక్తతర్పణ చరిత్ర అంటూ తెల్లవాళ్ళు పాలించిన గడ్డ వారిది, సమ్మక్క సారక్కల ధిక్కార చరిత్ర మనది అంటారు ఈ కవితలో. ఈ కవిత మొత్తం తెలంగాణ ప్రాంత ప్రజల గోడును, గోసను, కడుపుమంటను, కృష్ణానదికి విన్నవించుకున్నట్లుగా వ్రాసిన తీరు అద్బుతం.
పిల్లర్లులేని మండపం /కప్పని పందిరి /కట్టని గోపురం /వేయి స్తంభాలుగా /ఊడలుదిగి/ తంతెలు తంతెలుగా /ఏమున్నదక్కడ /గ్లోబల్ పబ్బుల్లోకి /పబ్బుల్లాంటి వెబ్బుల్లోకి/ శిశిరీరం ముందు అకుల్లా /కన్నీటి బొట్లను రాల్చలేను /తావుకోసం /పక్షులు గిరికీలు కొడుతున్నయి /పై వాక్యాలు తావు శీర్షికతో వున్న కవితలోనివి. పారిశ్రామిక విప్లవం ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేసింది ఆ తర్వాత వచ్చిన ప్రపంచీకరణ పైత్యం పాలకులందరిని ఆవహించింది. దాని ప్రభావం మనిషిపై నేడు అజమాయిషీ చేస్తున్నది ఫలితంగా నేడు మనిషి అనేక సంఘర్షణలకు కారకుడు, బాధితుడు కావడం విశేషం. మిద్దెలు, పూరిల్లు, పెంకుటిల్లు, పోయి కాంక్రీటు భవంతులు వెలసినవి వానాకాలం గొడుగు, ఎండాకాలం ఏ.సి. మనిషికి ఇన్ని సౌకర్యాలు సమకూరినప్పుడు పాతదనం నేడు సంకుచితంగా మారి కొత్తదనం కాస్త విపరీతమైన సమస్యలకు దారితీస్తున్నది. ఈ కవిత శీర్షికతోనే సుంకిరెడ్డి సంపుటికి శీర్షిక కావడం యాదృచ్చికమైన తావు అనే పదానికి వ్యావహారికంగా స్థలం లేదా ప్రదేశం అని అర్ధం ఇది అనేక సందర్భాలలో వాడవచ్చును. ఆదిమానవుడి తావు ఎక్కడ అంటే చెట్టు లేదా కొండగుహలు, అని చెప్పాలి మరి నేటి ఆధునిక మానవుడి తావుఎక్కడ అంటే ఏం చెప్పగలం. ఆధునిక మానవుడు విహరించని స్థలం ఎక్కడైన ఉందా? అంటే ఎక్కడైనా సంచరిoచగల్గుతున్నాడు దాని ఫలితంగానే వాటి పర్యవసానాలు మిగితా జీవులకు ప్రాణసంకటంగా మారుతోంది. మనిషి విపరీత ప్రవర్తన వల్ల నేడు పర్యావరణ సమతౌల్యం దెబ్బతిని మనిషి మనుగడ, మనుషులతో పాటు ఆవిర్భవించిన జీవజాలం యొక్క మనుగడ ప్రశ్నార్ధకం అవుతోంది. ఈ కవితలోనే చివర్లో ఇలా అంటారు తావు కోసం పక్షులు గిరికీలు కొడుతున్నయి అని దీనిని బట్టి కూడా తావు యొక్క ప్రాముఖ్యత ఎంత ప్రశ్నార్ధకం అవుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఒక విషయం గుర్తు చేయాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం నేడు మనిషికి పర్యావరణం విసురుతున్న పెను సవాలుకి పరిష్కారం కనుగొనలేక ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, ఈ పరిస్థితి ముందు ముందు కూడా ఇలానే కొనసాగితే భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్ధకం కాక మానదు.
సుంకిరెడ్డి ఊటబావి లాంటివారు వారి ప్రతిభను నేను ఈ విధంగానే చెప్పగలను. పదవీవిరమణ అంకెలు శరీరానికి తప్ప మనసుకు వర్తించవని నిరూపించి పలు రచనలు (తావు – 2016, వినిర్మాణం 2021) చేశారు. వీరు వ్రాసిన ముంగిలి గ్రంధం ఎంతోమందికి, పరిశోధన ప్రామాణిక గ్రంధం, నిరుద్యోగుల పాలిట కల్పతరువు అలానే తెలంగాణ చరిత్ర ఈ గ్రంధం ఎంతోమంది నిరుద్యోగులకు ఆధార గ్రంధం. ఇక వీరి మిగితా రచనలు దాలి, గనుమ మొదలైనవి. తావు కవితా సంపుటిలో మొత్తం 42 కవితలున్నవి దేనికవే వాస్తవికమైన, ప్రత్యేకమైన వస్తువైవిధ్యంతో వ్రాయబడినవి, ఏ కవితను కూడా తక్కువచేసి చూడలేం.
డాక్టర్ మహ్మద్ హసన్, 9908059234
Article about Poet Sunkireddy Narayanareddy