Thursday, November 14, 2024

ఆ పథకాల కోసమే జాతీయ రాజకీయల్లోకి కెసిఆర్: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: తెలంగాణలో ప్రజలకు అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు సిఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో ఇస్తున్నట్లుగా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు తదితర సంక్షేమ పథకాలను దేశమంతా అమలు చేస్తామని, తెలంగాణ ప్రజల మాదిరిగానే దేశంలోని ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

మహబూబ్ నగర్ రూరల్ మండల పరిధిలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. అప్పాయిపల్లి, ఓబులాయపల్లి ఓబులాయపల్లి తండా, కోటకదిర, పోతన్ పల్లి, మాచన్ పల్లి, రామచంద్రాపూర్ గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ, కొత్త పింఛన్ కార్డుల పంపిణీ తో పాటు కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు రూరల్ మండలంలో నెల నెలా 4349 మందికి రూ. 10.234 లక్షల మేర పింఛన్లు వచ్చెవని, తెలంగాణ ఏర్పడిన తర్వాత 5561 మందికి రూ. 1.196 కోట్ల పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా మండలంలో ఒక పింఛన్ల రూపంలోనే రూ.114.75 కోట్ల విలువైన పింఛన్లను లబ్ధిదారులకు అందించామన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా పథకాల కోసం ఎనిమిది ఏళ్లలో రూ. 102.09 కోట్ల నిధులను ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. రూ. 2016, రూ.3016 పింఛన్లు తీసుకుంటున్న వాళ్లెవరూ ముఖ్యమంత్రి కెసిఆర్ ను, తమ ప్రభుత్వాన్ని మర్చిపోరని తెలిపారు. పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళందరికీ రెండు నెలల్లోపు ఆయా గ్రామాల్లోనే ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ఎంపిపి సుధాశ్రీ, జిల్లా రైతు బంధు సమితి డైరెక్టర్ మల్లు నరసింహారెడ్డి, జడ్పిటిసి వెంకటేశ్వరమ్మ, వైస్ ఎంపిపి అనిత, ముడా డైరెక్టర్ ఆంజనేయులు, డిసిసిబి డైరెక్టర్ నర్సింహులు, మండల రైతు బంధు సమితి డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News