హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో 57 లక్షల మంది వరద బాధితులు రానున్న మూడు మాసాలు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోనున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన మానవతా వ్యవహారాల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌లో ఇటీవల కురిసిన అసాధారణ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తడంతో 1695 మంది మరణించగా 3 కోట్ల 30 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారని, 20 లక్షలకు పైగా ఇళ్లు నేలమట్టమై లక్షలాది మంది తాత్కాలిక శిబిరాలలో తలదాచుకుని జీవిస్తున్నారని పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సోమవారం వెల్లడించింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో కొనసాగుతున్న వరదల వల్ల ఆ దేశంలో ఆహార సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థ శనివారం విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది.
సెప్టెంబర్, నవంబర్ నెలల మధ్య వరద తాకిడికి గురైన ప్రాంతానికి చెందిన 57 లక్షల మంది ప్రజలు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆ సంస్థ తెలిపింది. వరదల పరిస్థితి తలెత్తడానికి పూర్వమే పాకిస్తాన్ జనాభాలో 16 శాతం మంది ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కాగా..పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఆహార కొరత ఇప్పట్లో ఏర్పడే అవకాశం లేదని స్పష్టం చేసింది. దేశంలో సమృద్ధిగా గోధుమ నిల్వలు ఉన్నాయని, మరిన్ని నిలల కోసం ప్రభుత్వం గోధుమలను దిగుమతి చేసుకుంటోందని పాక్ ప్రభుత్వం తెలిపింది.