ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిన ఇసి 7న నోటిఫికేషన్ జారీ
అదేరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం.. 14న తుది గడువు
నవంబర్ 6న ఓట్ల లెక్కింపు మరో ఐదు రాష్ట్రాల్లోని 6 అసెంబ్లీ
నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నల్లగొండ జిల్లాలో ఎన్నికల కోడ్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణతో పాటు మరో 5 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) ప్రకటించింది. నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు ఇసి నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ నెల 7వ తేదీన ఎ న్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రి య ప్రారంభమతుంది. ఈ నెల 14న నామినేషన్ల గడువు ముగియనున్నది. 15న నామినేషన్లను పరిశీలిస్తారు. 17 నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది.
నవంబర్ 3న ఎన్నికలకు పోలింగ్ జరుగనుండగా.. 6న ఓట్లను లెక్కించనున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముందు ఎంఎల్‌ఎగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తెలంగాణలోని మునుగోడుతో పాటు అందేరి ఈస్ట్ (మహారాష్ట్ర), మోకమా (బిహార్), గోపాల్ గంజ్ (బిహార్), అదంపూర్ (హరియాణా), గోల గోఖర్నాడ్ (ఉత్తరప్రదేశ్), ధామ్ నగర్ (ఒడిశా)లో స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి.
ముఖ్యమైన తేదీలు
ఉప ఎన్నికల నోటిఫికేషన్- అక్టోబర్ 7
నామినేషన్ల స్వీకరణ గడువు అక్టోబర్ 14
నామినేషన్ల పరిశీలన- అక్టోబర్ 15
నామినేషన్ల ఉపసంహరణ గడువు- అక్టోబర్ 17
ఎన్నికల పోలింగ్ – నవంబర్ 3
ఓట్ల లెక్కింపు- నవంబర్ 6
నల్గొండ జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు
రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో సోమవారం నుంచి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ మేరకు నల్గొండ జిల్లా కలెక్టర్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
7 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఇసి
తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానంతోపాటు బీహార్‌లోని మొకామ, గోపాల్‌గంజ్, మహారాష్ట్రలోని అంధేరి(తూర్పు), హర్యానాలోని ఆదంపూర్, ఉత్తర్ ప్రదేశ్‌లోని గోలా గోరఖ్‌నాథ్, ఒడిశలోని ధామ్‌నగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. సిట్టింగ్ శాసనసభ్యులు మరణించడంతో అంధేరి(తూర్పు), గోలా గోరఖ్‌నాథ్, గోపాల్‌గంజ్, ధామ్‌నగర్ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఒక కేసులో దోషిగా తేలిన దరిమిలా సిట్టింగ్ ఎమ్మెల్యేపై అనర్హత వేటుపడడంతో మొకామ స్థానానికి ఖాళీ ఏర్పడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ రాజీనామా చేయడంతో ఆదంపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నది.