జెడి(యు) ఆరోపణ
పాట్నా: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బిజెపి తరఫున పనిచేస్తున్నారని, ఆయన చేపట్టిన జన్ సురాజ్ యాత్రకు ఎక్కడ నుంచి నిధులు వస్తున్నాయని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంలోని జెడి(యు) ప్రశ్నించింది. గతంలో జెడి(యు) జాతీయ ఉపాధ్యక్షునిగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు నితీశ్ కుమార్ పాలనను విమర్శించడాన్ని జెడి(యు) అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ తప్పుపట్టారు. గత పదేళ్ల నితీశ్ పాలనలో రాష్ట్రం సాధించిన ప్రగతి గురించి బీహార్ ప్రజలకు తెలుసని, దీనికి ప్రశాంత్ కిశోర్ సర్టిఫికెట్ అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిశోర్ తన పాదయాత్రకు ఏ పేరైనా పెట్టుకోవచ్చని, కాని ఆయన మాత్రం బిజెపి తరఫున పనిచేస్తున్నట్లు తమకు కనపడుతోందని మంగళవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ లలన్ అన్నారు. ఆయన తన యాత్రకు చేస్తున్న భారీ ప్రచారం పట్ల తమకు చాలా అనుమానాలున్నాయని ఆయన చెప్పారు. పెద్ద పార్టీలు సైతం పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇవ్వడానికి వెనుకాడుతున్నాయని, కాని ప్రశాంత్ కిశోర్ తన పాద యాత్ర మొదటిరోజే ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారని, ఆయన చెప్పారు. దీన్ని ఐటి, సిబిఐ, ఇడి వంటి దర్యాప్తు సంస్థలు ఎందుకు పట్టించుకోవడం లేదని, దీన్ని బట్టే ఈ యాత్ర వెనుక కేంద్రంలోని అధికార పార్టీ ఉందని అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.