సర్కార్ దవఖానల్లో కాన్పులు పెరిగేలా గర్భిణీలకు సలహాలు
వైద్యశాఖ ప్రకటించి రెండు నెలలు గడిచిన అందని పరిస్థితి
అధికారులు తీరుపై ఆసహనం వ్యక్తం చేస్తున్న వైద్య సిబ్బంది
దసరాకు నజరానా ఇస్తారని ఎదురు చూసిన తప్పని నిరాశ
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలోని ప్రభుత్వం ఆసుపత్రుల్లో సాధారణ కాన్పులు జరిగేలా ప్రోత్సహించే వైద్య సిబ్బందికి నజరానా ఇస్తామని వైద్యశాఖ ప్రకటన చేసిన ఇప్పటివరకు అందలేదని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. గర్భిణీలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా సలహాలిస్తూ సర్కార్ ఆసుపత్రులకు వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు. ఆసుపత్రులుకు నెల వారీగా పరీక్షలు, మందులు కోసం వచ్చే గర్భిణీలకు కౌన్సిలింగ్ ఇస్తూ ఆపరేషన్లు చేసుకుంటే భవిష్యత్తులో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని, అందుకోసం ఆరు నెలల గర్భిణీగా ఉన్నప్పుడు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం తప్పకుండా చేయాలని సూచిస్తున్నారు. వైద్యుల సలహాలు పాటిస్తే సకాలంలో సాధారణ కాన్పు జరిగేలా తాము చేస్తామని వివరిస్తున్నారు. వైద్య సిబ్బంది అంత కష్టపడిన ప్రసవాల పారితోషికం ఇప్పటివరకు పంపిణీ చేయకపోవడంపై అసహన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత స్దాయి సిబ్బందికి వచ్చే పారితోషికాలు సకాలంలో అందుతాయి.
కింది స్దాయి సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహిస్తే పట్టించుకునే వారు కనిపించరని మండిపడుతున్నారు. కనీసం దసరా పండగకు ఇస్తారని ఆశపడితే వచ్చే నెల చూద్దామని సమాధానం చెప్పడం తప్ప ఇచ్చిన హామీ నేరవేర్చడం లేదంటున్నారు. రెండు నెలకితం వైద్యశాఖ ఉన్నతాధికారులు సాధారణ ప్రసవానికి రూ. 3వేలు నజరానా ఇస్తామని జీవో జారీ చేసిందని, పారితోషికం డాక్టర్ నుంచి శానిటైషన్ స్టాప్‌వరకు పంపిణీ చేస్తామని వెల్లడించారు. గైనకాలజిస్టు, మెడికల్ ఆఫీసర్‌కు రూ. వెయ్యి, మిడ్‌వైప్, స్టాప్‌నర్సు, ఏఎన్‌ఎంలకు రూ. వెయ్యి, ఆయా,శానిటైషన్ వర్కర్లకు రూ. 500, సబ్ సెంటర్ ఏఎన్‌ఎంకు రూ. 250, ఆశాకు రూ. 250 చొప్పన అందజేస్తామని,ఈ ఇన్సెంటీవ్స్ నేషనల్ హెల్త్ మిషన్ నిధులు నుంచి ఇవ్వనున్నట్లు తెలిపారు.
ప్రతి నెలా టీచింగ్ ఆసుపత్రుల్లో 350, జిల్లా ఆసుపత్రులు, ఎంసీహెచ్ సెంటర్లకు 250, ఏరియా ఆసుపత్రుల్లో 150, సీహెచ్‌సీల్లో 50, పీహెచ్‌సీల్లో 10, సాధారణ పీహెచ్‌సీల్లో 5 ప్రసవాల చొప్పన చేయాలని, అప్పుడే పారితోషికం బృందాలను ఎంపిక చేస్తామని వైద్యాధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు జరిగి ప్రసవాలను వివరాలు తీసుకున్న పారితోషికం విషయంలో జాప్యం చేయడం సరికాదని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. వైద్యశాఖ ఉన్నతాధికారులు ప్రోత్సహకాల విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.