అధిక ధరల వసూళ్లు చేస్తున్నారంటూ ప్రయాణికుల ఫిర్యాదు
మూడురోజుల్లో సర్వీసులను నిలిపివేయాలని ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీలకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్న ఆయా కంపెనీలపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. రాబోయే మూడు రోజుల్లో ఆయా సర్వీసులను నిలుపుదల చేయాలని ఆదేశించింది. అధిక ధరలు వసూలు చేస్తున్నారంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తొలి 2 కిలోమీటర్ల వరకు రూ.30 వసూలు చేయాలి. దీంతోపాటు ఆపై ప్రతి 2 కిలోమీటర్‌కు రూ.15 చొప్పున తీసుకోవాలి. అయితే, ఈ యాప్స్ తొలి 2 కిలోమీటర్లకే రూ.100 వరకు ఛార్జీ చేస్తుండడంతో వినియోగదారుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి.
ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా ఆటో రిక్షాలను నడుపుతున్నారంటూ ఆయా కంపెనీలకు నోటీసులు పంపింది. మూడు రోజుల్లో సేవలను నిలుపుదల చేయాలని ఆదేశాలిచ్చింది. రవాణా శాఖ నిబంధనల ప్రకారం కేవలం కార్లను మాత్రమే ట్యాక్సీలుగా నడపాలి. ఆటో రిక్షా సేవలను అందించడం నిబంధనలకు విరుద్ధం. పైగా ప్రభుత్వం విధించిన ఛార్జీల కంటే ఆయా కంపెనీలు అధిక ఛార్జీలను వసూలు చేస్తుండడంతో రవాణా శాఖ ఆయా కంపెనీలు షాకిచ్చింది. అందుకే ఆటో రిక్షా సర్వీసులను వెంటనే నిలుపుదల చేయాలని ఆదేశించింది. మరోవైపు ఆటో డ్రైవర్లు సైతం సొంతంగా యాప్‌ను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘నమ్మ యాత్రి’ పేరిట ఓ యాప్‌ను లాంచ్ చేసేందుకు బెంగళూరులోని ఆటో డ్రైవర్ల యూనియన్ ప్రయత్నిస్తుండడం గమనార్హం.