Saturday, December 21, 2024

మహిళల ఆసియా కప్: భారత్‌కు పాకిస్థాన్ షాక్

- Advertisement -
- Advertisement -

Women's Asia Cup: Pakistan beat India by 13 runs

సిల్హేట్: మహిళల ఆసియాకప్‌లో భారత వరుస విజయాలకు బ్రేక్ పడింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ మహిళల టీమ్ 13 పరుగుల తేడాతో భారత్‌పై సంచలన విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత మహిళలకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. ఇక కిందటి మ్యాచ్‌లో పసికూన థాయిలాండ్ చేతిలో అవమానకర రీతిలో ఓటమి పాలైన పాకిస్థాన్‌కు భారత్‌పై విజయం పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన భారత్ 19.4 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటై ఓటమి చవిచూసింది. స్వల్ప లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ మేఘన(15) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్(2) కూడా నిరాశ పరిచింది. మరోవైపు జట్టును ఆదుకుంటారని భావించిన స్మృతి మంధాన(17), పూజా వస్త్రాకర్(5) కూడా నిరాశే మిగిల్చారు. మరోవైపు హేమలత (20), రిచా ఘోష్ (26) కొద్ది సేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. పాకిస్థాన్ బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. ఇక పాక్ బౌలర్లలో నశ్రా సంధు మూడు, నిదాదర్, సాదియా ఇక్బాల్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ను కెప్టెన్ బిస్మా మారూఫ్, నిదాదర్ ఆదుకున్నారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ పాకిస్థాన్‌కు మెరుగైన స్కోరును సాధించి పెట్టారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన మారూఫ్ రెండు ఫోర్లతో 32 పరుగులు చేసింది. ఇక నిదాదర్ 37 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 56 పరుగులు సాధించింది. దీంతో పాకిస్థాన్ స్కోరు 137 పరుగులకు చేరింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు, పూజా వస్త్రాకర్ రెండు వికెట్లు తీశారు.

Women’s Asia Cup: Pakistan beat India by 13 runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News