Sunday, November 24, 2024

పదేళ్లుగా ఫ్యాక్టరీ ఉంది.. అయినా మాకు ఈ విషయం తెలియదు

- Advertisement -
- Advertisement -

Locals' surprise at making inferior cough syrup

నాసిరకం దగ్గు సిరప్ తయారీపై స్థానికుల ఆశ్చర్యం

సోనిపట్: ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి కారణమైన నాసిరకం దగ్గు సిరప్‌ను ఎగుమతి చేసింది హర్యానాలోని సోనిపట్ ప్రాంతానికి చెందిన ఓ ఫ్యాక్టరీ అనే విషయం స్థానికంగా ఉండే ప్రజలకు మొన్నటివరకు తెలియనే తెలియదంటే ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఇది పచ్చి నిజం. ‘ ఇలా అయిందని మాకు తెలియనే తెలియదు. దేవుడి దయ వల్ల మనం ఇక్కడ ఈ మందును తీసుకోలేదు’ అని ఈ దగ్గు సిరప్‌లను తయారు చేస్తున్న మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌కు ఎదురుగా నివసిస్తున్న కుంటి అనే వృద్ధురాలు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పిటిఐ ఈ విషయాన్ని చెప్పినప్పుడు నిర్ఘాంత పోయిన ఆ వృద్ధురాలు తన చేతుల్లోని మనవరాలిని గాఢంగా ఎదకు హత్తుకోవడం కనిపించింది.‘ ఇక్కడ ఈ ఫాక్టరీ ఎనిమిది, పదేళ్లుగా ఉంది. అయితే ఇక్కడ నాసిరకం ఉత్పత్తులు తయారవుతున్నాయని మేము ఎప్పుడూ అనుకోలేదు. వాళ్లు వాటిని ఇండియాలో కూడా మార్కెట్ చేస్తున్నారా,ఆ సిరప్‌ల పేర్లేమిటి? వాటిని కొనకుండా జాగ్రత్త పడతా’ అంటూ పిటిఐ ప్రతినిధికి ఆమె ప్రశ్నల వర్షం కురిపించింది.

అయితే ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే ఉత్పత్తులు విదేశాలకు మాత్రమే ఎగుమతి చేశారని ఆమె పక్కన ఉన్న మరో మహిళ చెప్పడంతో కుంటి ఊరట చెందింది. నిజానికి పారిశ్రామిక కేంద్రమైన సోనిపట్‌లో ఉండే వందలాది కంపెనీల్లో ఇది ఒకటి మాత్రమే. మొన్నటివరకు దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కూడా. అయితే ఇప్పుడు ఈ వార్త వెలుగులోకి రావడం, అధికారులు ఫ్యాక్టరీ మెయిన్ గేట్‌కు నోటీసులు అంటించడంతో అది ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. చుట్టుపక్కల ఉండే చాలా మంది ఈ ఫ్యాక్టరీని చూడడానికి ఆసక్తితో వస్తున్నారు.శుక్రవారం పిటిఐ రిపోర్టర్ ఫ్కాటరీ స్థలాన్ని సందర్శించినప్పుడు అక్కడ హర్యానా డ్రగ్‌కంట్రోల్ అధికారులు దర్యాప్తు చేస్తుండడం కనిపించింది. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ చుట్టుపకర్కల నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. మెయిన్ గేట్ దగ్గర కాపలా ఉన్న గార్డులు లోనలికి ఎవరినీ అనుమతించడం లేదు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న టీస్టాల్స్, టిఫిన్‌సెంటర్లు లాంటి వాటిలో ఏ ఇద్దరు కలిసినా దీనిపైనే చర్చ జరుగుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News