ముంబై: గాయంతో ప్రపంచకప్‌కు దూరమైన స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో మరో సీనియర్ బౌలర్ మహ్మద్ షమీని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. ఇక ఫిట్‌నెస్ పరీక్షల్లో నెగ్గితే బుమ్రా స్థానంలో అతన్ని టీమిండియాకు ఎంపిక చేయడం ఖాయం. ఈ విషయంలో ఇప్పటి వరకు బిసిసిఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా షమీ ఎంపిక దాదాపు ఖరారైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. ఇటీవలే షమీ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
దీంతో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు అతను దూరమయ్యాడు. కాగా, షమీ ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్‌లో స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు. ఇక స్టార్ బౌలర్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా వరల్డ్‌కప్ జట్టు నుంచి వైదొలిగాడు. దీంతో బుమ్రా స్థానంలో షమీని ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని బిసిసిఐ పెద్దలు భావిస్తున్నారు. బౌన్స్‌కు సహకరించే ఆస్ట్రేలియా పిచ్‌లపై షమీని ఎంపిక చేస్తేనే బాగుంటుందని ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు సూచించారు. దీంతో బిసిసిఐ కూడా షమీవైపే మొగ్గు చూపుతోంది. అంతేగాక మరో కీలక బౌలర్ దీపక్ చాహర్ కూడా గాయం బారిన పడడం కూడా షమీ ఎంపికకు మార్గం సుగమం చేసిందని చెప్పాలి. ఇక మరికొన్ని రోజుల్లోనే షమీ ఆస్ట్రేలియాకు బయల్దేరి వెళ్లనున్నట్టు సమాచారం.
Mohammed Shami to Replace Bumrah for T20 World Cup?