మనతెలంగాణ/ హైదరాబాద్: మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టిఆర్‌ఎస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని బిజెపిలో చేరానని చెప్పిన ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజును ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల అధికారిని కలిసిన వారిలో ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, పార్టీ జనరల్ సెక్రటరీలు శ్రీనివాస్‌రెడ్డి, సోమ భరత్ ఉన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
మునుగోడులో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్టి తాను రూ.18 వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొని బిజెపిలో చేరానని ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారని, అందుకని రాజగోపాల్ రెడ్డిని ఈ ఉప ఎన్నికలలో పోటీ చేయకుండా అనర్హుడిని చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి వినతి పత్రం అందజేశారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటూనే బిజెపి ప్రభుత్వం నుంచి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు తీసుకున్నట్టు ఓ టివి ఛానల్‌లో స్వయంగా చెప్పారని ఎంపి బడుగుల లింగయ్యయాదవ్ పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అవహేళన చేసే చర్య అని, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్‌ను గాలికి వదిలేశారని విమర్శించారు.
ఇచ్చి పుచ్చుకోవడం కింద ఇలాంటి పనులు చేశారని ఎన్నికల ప్రధాన అధికారికి విన్నవించామని చెప్పారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి రాజగోపాల్ రెడ్డిని మునుగొడులో పోటీ చేయకుండా అనర్హత వేయాలని ఈసీని కోరామని వెల్లడించారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డిని అనర్హుడి గా ప్రకటించాలంటూ టిఆర్‌ఎస్ పక్షాన ఎన్నికల అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇలాంటి వారిని ప్రోత్సాహించద్దు అని ఎన్నికల అధికారిని కోరాం. రాజగోపాల్ రెడ్టి బిజెపి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి దొంగలను ప్రజలు తరిమికొడతారు. మునుగోడులో ఎగిరెది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు.