ముచ్చుమర్రి సమీపాన ఎత్తిపోతల పథకం
శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వంద రోజుల నీటి తరలింపునకు స్కెచ్ ఓర్వకల్లు సమీపాన
మెగా ఇండస్ట్రియల్ హబ్ కోసం ప్రత్యేక ప్రణాళిక టెండర్ల ప్రక్రియ పూర్తి.. నిర్మాణ పనులకు
ఇటీవల మంత్రి బుగ్గన భూమి పూజ బోర్డు అనుమతులు లేకుండా ఎపి ఇష్టారాజ్యం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జలాల దోపిడీకి టెండర్ పడింది. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి అక్రమంగా కృష్ణానదీ జలాలను తరలించుకుపోయేందుకు జగన్ సర్కార్ మరో ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ. 428కోట్ల వ్యయంతో కూడిన పనులకు ఎపి ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది. హైదరాబాద్‌కు చెందిన కేఎల్‌ఎస్‌కే ఇన్‌ఫ్రాటెక్, ప్రతాప్‌రెడ్డి కంపెనీలు జా యింట్ వెంచర్‌గా ఈ ఎత్తిపోతల పనులు దక్కించుకున్నాయి. టెండర్ల ప్రక్రియ పూ ర్తి కావడంతో కర్నూలు జిల్లాకు చెందిన ఎపి ఆర్థ్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంధ్రనాధ్‌రెడ్డి ఇటీవల ఎత్తిపోతల పథకం పనులకు భూమిపూజ కూడా చేశారు. తెలంగా ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రిజర్వాయర్‌కు ఎగువన ముచ్చుమర్రి వద్ద ఈ కొత్త ఎత్తిపోతల పథకానికి ఏపి ప్రభుత్వం స్పాట్ పెట్టింది.
100 పాటు శ్రీశై లం రిజర్వాయర్ బ్యాక్ వాటర్‌ను ఎత్తిపోసి నీటిని కర్నూలు నగరానికి సమీపాన ఉన్న ఓర్వకల్లు వద్ద నిర్మించబోయే రిజర్వాయర్‌కు తరలించనున్నారు. ఇందుకోసం ఓర్వకల్లు వద్ద ఒక టిఎంసి నీటినిలువ సామర్ధంతో జలాశయాన్ని నిర్మించనున్నారు. ముచ్చుమర్రి సమీపాన కృష్ణానది బ్యాక్‌వాటర్‌ను తోడిపోసుకునేందుకు ఇన్‌టేక్‌వెల్ , ఎత్తిపోతలకు అవసరమైన పంప్‌హౌస్ నిర్మాణం ,భారీ మోటార్ల ఏర్పాటు, పవర్‌స్టేషన్ , ముచ్చుమర్రి పంప్‌హౌస్ నుంచి ఓర్వకల్ వద్ద ప్రతిపాదిత జలాశయం వరకూ పైప్‌లైన్ నిర్మాణం పనులకు మొత్తం రూ.428కోట్ల అంచనాతో ఈ పథకం పనులకు ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల కాలవ్యవధిలో ఈ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు తొలి ఏడాది రూ.288కోట్లు, ఆ తరువాత ఏడాది మిగిలిన నిధులు ఖర్చుచేయనున్నారు.
మెగా ఇండస్ట్రియల్ హబ్ పేరుతో జలదోపిడి:
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం ఓర్వకల్లు సమీపాన ఉన్న మెరక పాంత్రంలో మెగాఇండస్ట్రియల్ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 33వేల ఎకరాలను ఎంపిక చేసింది. ఇందులో దశల వారీగా ఇండస్ట్రియల్ హబ్‌ను ఏర్పాటు చేయతలపెట్టింది. తొలివిడుతగా 10,257ఎకరాల్లో ఈ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం 11గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ , ప్రైవేటు భూములను సేకరించింది. మెగా ఇండస్ట్రియల్ హబ్ కోసం అవసరమైన నీటిని శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కేటాయించింది.
బోర్డు అనుమతులు లేకుండా ఇష్టారాజ్యం!
కృష్ణానదీజలాలను వినియోగించుకోవటంలో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం మేరకు కృష్ణానదీయాజమాన్యబోర్డును ఏర్పాటు చేసింది. జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపికి కేటాయించి 811టిఎంసీల నీటికేటాంపుల్లోనే తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నీటిని వినియోగించుకోవాల్సివుంది. రెండు రాష్ట్రాలకు చేసిన నీటికేటాయింపుల మేరకు ఇప్పటికే ప్రాజెక్టులు పూర్తయి కొన్నింటికి నీటి వినియోగం జరుగుతుండగా, మరికొన్ని ప్రాజెక్టుల నిర్మాణాలు చివరిదశలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే కృష్ణానదీజాలాల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఇక్కడి ప్రజలతోపాటు ప్రభుత్వం కూడా ఘోషిస్తోంది.
నీటివాటాలో న్యాయం చేయాలని పలు మార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ణప్తులు చేసింది. చివరకు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. మరో వైపు ఏపిలో జగన్ ప్రభుత్వం కృష్ణానదీజలాలను అక్రమంగా తరలించుకుపోయేందుకు ప్రాజెక్టు మీద ప్రాజెక్టులు నిర్మిస్తూనే ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఒక వైపు కొనసాగుతుండగానే , మళ్లీ ఓర్వకల్ మెగాఇండస్ట్రియ్ హబ్ అవసరాల కోసం అంటూ మరో ఎత్తిపోతల పథకాన్ని అక్రమంగా చేపట్టడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి నామమాత్రంగానైన తెలపకుండా, కృష్ణానదీయాజమాన్య బోర్డులో చర్చించి ఆమోదం పొందకుండా నిర్మిస్తున్న ఈ ఎత్తిపోతల పథకంతో ఏపి ప్రభుత్వం మరో మారు జలవివాదాలను రాజేసింది.