శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్ ఇ తొయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు సైనికులతోపాటు ఆర్మీకి చెందిన జాగిలం గాయపడింది. తంగ్‌పావా ఏరియాలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందడంతో పోలీసులు భద్రతాబలగాలతో కలిసి ఆదివారం రాత్రి గాలిస్తుండగా, వారిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని పోలీస్ అధికారి తెలిపారు. హతులకు ఎల్‌ఇటితో సంబంధం ఉందని, అనేక ఉగ్రవాద నేరాలతో వీరికి ప్రమేయం ఉందని పోలీస్ అధికారి తెలిపారు. గాయపడిన సైనికులను శ్రీనగర్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. రెండు ఎకె రైఫిల్స్, ఇతర సామగ్రి నిల్వలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఆర్మీ జాగిలంపై ఉగ్రవాద దాడి
అనంతనాగ్ జిల్లాలో సోమవారం కేంద్ర బలగాలకు , ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో ఆర్మీకి చెందిన జూమ్ అనే పేరుగల జాగిలం తీవ్రంగా గాయపడింది. ఉగ్రవాదులు స్థావరంగా ఉన్న ఒక ఇంటి లోకి బలగాలు సోమవారం తమ జాగిలాన్ని పంపారు. ఆర్మీ శిక్షణ పొందిన ఈ జాగిలం జూమ్ చాలా క్రూరమైనది. ఉగ్రవాదుల జాడ పసికట్టడంలో దిట్ట. ఉగ్రవాదుల ఇంటి లోకి చొరబడగానే రెండు తుపాకీ తూటాలు తగిలి తీవ్రంగా గాయపడింది. జాగిలం అంతటితో ఆగక, ఉగ్రవాదులను ఎదిరించిండి. తన టాస్క్ కచ్చితంగా నెరవేర్చడం వల్లనే ఉగ్రవాదులను నిర్వీర్యం చేయగలిగిందని అధికారులు తెలిపారు. గాయపడిన జూమ్‌ను వెంటనే ఆర్మీ వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు.