హైదరాబాద్: జాతీయ బాలికల దినోత్సవాన్ని మంగళవారం జరుపుకుంటున్న సందర్భంగా బాలికలందరికీ రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆడపిల్లకు సమాజంలో సమాన అవకాశాలు, సమాన వాటా కల్పించాలనే లక్ష్యంతో ఈ ఏడాది బాలికల దినోత్సవం జరుపుకుంటున్నందుకు ప్రతి ఒక్కరు ఈ లక్ష్య సాధనలో భాగమై బాలికల గొప్పతనాన్ని చాటాలని పిలుపునిచ్చారు. బాలికల రక్షణకు, బాలికల భ్రూణ హత్యల నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు, బాలికలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ వారి సంక్షేమం, అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు పనిచేయకుండా ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలనే గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల పాటు ప్రతి నెల 2000 రూపాయల చొప్పున ఇస్తోందని, బాలిక పుడితే ప్రత్యేకంగా మరో 1000 రూపాయలు అదనంగా కలిపి 13000 రూపాయలు ఇస్తుందన్నారు.
బాలికల రక్షణ, అవసరం, వారి విద్యకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత కోసం ఎప్పటికప్పుడు టీవీలు, రేడియోలు, అవుట్ డోర్ మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తూ, సైకిల్ ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. గ్రామ సభలు, మండల స్థాయిలో మహిళా సభలు నిర్వహిస్తూ భ్రూణ హత్యల నివారణ, బాలికల రక్షణ, విద్యపై తల్లిదండ్రులను చైతన్యపరుస్తున్నామన్నారు. నిరుపేద, అనాథ బాలికల జన్మదినోత్సవాలను నిర్వహిస్తూ వారికి సమాజం పట్ల నమ్మకం కల్పించే చర్యలు చేపడుతున్నామన్నారు. బాలికా విద్యను ప్రోత్సహించడంలో భాగంగా పదో తరగతి, ఇంటర్ లో టాపర్స్ గా నిలిచిన బాలికలకు నగదు ప్రోత్సహకాన్ని అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాలికలకు ఇస్తున్న ప్రాధాన్యత, వారి కోసం చేస్తున్న కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో బాలురు, బాలికల నిష్పత్తిలో గణనీయమైన పెరుగుదల నమోదు అయిందన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో ఆడపిల్లల రక్షణ, సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, వీరి పట్ల దాడులు చేసిన వారిపట్ల, అమానుషంగా వ్యవహరించిన వారిపట్ల కఠినంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.