దిగ్విజయ సింగ్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో ఒక్కరోజు, కొద్ది సేపు పాల్గొనాలని ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఇది ప్రపంచానికి మంచి సందేశాన్ని పంపుతుందని ఆయన పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిపై పోరాడేందుకు పెద్ద పార్టీ కాంగ్రెస్‌తో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలసిరావాలంటూ సోమవారం ఆర్‌జెడి జాతీయ సదస్సులో లాలూ ఇచ్చిన పిలుపుపై దిగ్విజయ మంగళవారం స్పందించారు. దేశంలో ఎమర్జెన్సీ తరహా నియంతృత్వ వాతావరణం నెలకొందని, వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని లాలూ తన ప్రసంగంలో ఆరోపించారు. బిజెపికి వ్యతిరేకంగా ఐక్యత కోసం జరుగుతున్న ప్రయత్నాలకు సహకరించని పార్టీలను ప్రజలు క్షమించబోరని లాలూ అన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యతో అల్లాడుతున్న ప్రజలు నరేంద్ర మోడీ ప్రభుత్వ పతనాన్ని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. వైద్య చికిత్స కోసం తాను మంగళవారం సింగపూర్ వెళుతున్నట్లు లాలూ ఈ సభలో తెలిపారు.