ఉత్తరాది, పశ్చిమ ప్రాంతాలకు బాగా కనిపిస్తుంది
ఈశాన్య ప్రాంతాలకు అంతగా కనిపించదు
కోల్‌కతా : దీపావళి పర్వదినం అక్టోబర్ 25న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నది. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఇదే. ఈ గ్రహణం మన దేశం లోని అనేక ప్రాంతాలకు కనిపిస్తుందని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త దేవీ ప్రసాద్ దుయారీ వెల్లడించారు. తూర్పు ప్రాంత నగరాల ప్రజలకు తక్కువ సమయంలో ఈ గ్రహణం కనిపిస్తుందని, ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాల ప్రజలు బాగా చూడగలుగుతారని వివరించారు. ఈశాన్య ప్రాంతాలకు మాత్రం ఈ గ్రహణం అంతగా కనిపించబోదని, ఆయా ప్రాంతాల్లో సూర్యాస్తమయం తరువాతనే గ్రహణ కాలం రావడమే దీనికి కారణంగా పేర్కొన్నారు. మనదేశంతోపాటు ఐరోపా, ఉత్తర అమెరికా, మధ్య ప్రాచ్య, ఆసియా దేశాల్లో చాలా ప్రాంతాలకు కనిపిస్తుందని చెప్పారు. సూర్యచంద్రులు ఒకే కక్షలో ఉండటంతో సూర్యుడి నీడ భూమి మీద పడకుండా చంద్రుడు పాక్షికంగా అడ్డుకోవడంతో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. పాక్షిక సూర్యగ్రహణాన్ని ఆన్షిక సూర్యగ్రహణం అని కూడా అంటారు. సంపూర్ణ సూర్యగ్రహణం ఉన్నప్పుడు సూర్యుడి డిస్క్ అంటే మధ్యభాగం చంద్రుడితో పూర్తిగా కప్పబడి ఉంటుంది.
అదే పాక్షిక సూర్యగ్రహణంలో సూర్యుడి కొద్ది భాగం మాత్రమే చంద్రుడితో కప్పబడి ఉంటుంది. పాక్షిక సూర్యగ్రహణం ఆరోజు (అక్టోబర్ 25) మధ్యాహ్నం 2.29 గంటలకు ఐస్‌ల్యాండ్‌లో ప్రారంభమవుతుంది. 4.30 గంటలకు రష్యా నుంచి పూర్తిగా చూడవచ్చు. సాయంత్రం 6.32 సమయానికి అరేబియా సముద్రం మీదుగా పూర్తవుతుంది. దేశం లోని ఈశాన్య ప్రాంతాల వారు సూర్యాస్తసమయం లోనే పాక్షిక సూర్యగ్రహణాన్ని కొంతవరకు చూడగలుగుతారు. మెట్రోపాలిటన్ నగరాల్లో మధ్యాహ్నం 4.52 సమయానికి పాక్షిక సూర్యగ్రహణం ప్రారంభమై, సాయంత్రం 5.01 గంటలకు పూర్తిగా చూడవచ్చు. సాయంత్రం 5.03 గంటలకు సూర్యాస్త సమయంలో ఇక పూర్తయిపోతుంది. గ్రహణం గరిష్ట స్థాయిలో కూడా అస్తమించే సూర్యుడి వెలుగును నాలుగు శాతం మాత్రమే చంద్రుడు అడ్డుకుంటాడు. బెంగాల్ ఉత్తర ప్రాంత నగరం సిలుగురిలో సాయంత్రం 4.41 నుంచి 4.59 గంటల మధ్య పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. న్యూఢిల్లీలో 4.29 గంటలకు ప్రారంభమై సూర్యాస్తమయంతో పాటు సాయంత్రం 6.09 గంటలకు ముగుస్తుంది.
రాజస్థాన్ జైసల్మేర్‌లో 4.26 నుంచి 6.09 గంటల వరకు పాక్షిక గ్రహణం ఉంటుంది. ముంబైలో 4.49 నుంచి 5.42 వరకు కనిపించి సాయంత్రం 6.09 గంటలకు ముగుస్తుంది. దక్షిణ, మధ్య భారతంలో సూర్యాస్తమయం ముందు కనిపిస్తుంది. నాగపూర్‌లో 4.49 నుంచి 5.42 వరకు కనిపిస్తుంది. బెంగళూరులో సాయంత్రం 5.12 గంటలకు ప్రారంభమై, 5.42కు గరిష్టస్థాయి చేరుకుని, 5.55కు పూర్తవుతుంది. చెన్నైలో సాయంత్రం 5.14 నుంచి 5.44 గంటల వరకు ఉంటుంది. తదుపరి భారీ సూర్యగ్రహణం 2031 మే 21న సంభవిస్తుంది. ఆ తరువాత 2034 మార్చి 20న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.