అ సొమ్మును మౌలిక సదుపాయాల కల్సనకో, వైద్య రంగంపైనో ఖర్చు చేయొచ్చు
ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్
న్యూఢిల్లీ: ఇష్టారాజ్యంగా అవధులు లేకుండా ఉచితాలు ప్రకటించడాన్ని మానుకోవాలని, ఎందుకంటే ఆ సొమ్మును మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, లేదా ఆరోగ్య రంగంలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించవచ్చని ప్రధానమంత్రికిఆర్థిక సలహామండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ అన్నారు. అయితే నిర్దిష్ట వర్గాలను సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే అవి కరోనా మహమ్మారి సమయంలో లాగా పేదలకు కష్టసమయంలో తోడ్పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘దుర్భర దారిద్య్రంలో ఉన్న వారిని ఆదుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది. అయితే ఉచిత విద్యుత్ లాంటి ఇష్టారాజ్యంగా ఉచితాలను ప్రకటించడాన్ని ప్రోత్సహిహించకూడదు’ అని పిటిఐతో మాట్లాడుతూ సన్యాల్ అన్నారు. ఉచిత విద్యుత్‌లాంటి సబ్సిడీలు గనుక లక్షిత వర్గాలకు సరిగా చేరకపోతే చివరికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి ఉచితాలపై ఖర్చు చేసే సొమ్మును మౌలిక సదుపాయాల నిర్మాణం లేదా, ఆరోగ్య రంగంలంటి వాటిపై ఖర్చు చేయవచ్చని ఆయన అన్నారు.
తమ ఎన్నికల హామీల ఆర్థిక సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి వీలుగా ఓటర్లకు కచ్చితమైన సమాచారాన్ని అందజేయలని గత వారం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు సూచిస్తూ దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా రాజకీయ పార్టీలు పోటీ పడి ఉచితాలను ప్రకటించడాన్ని ఇటీవల తప్పుబడుతూ ఇది పన్ను చెల్లింపుదారుల సొమ్మును వృథా చేయడమే కాకుండా, చివరికి ఆత్మనిర్భర్ భారత్‌గా ఎదగడానికి దేశం సాగిస్తున్న ప్రయాణాన్ని దెబ్బతీస్తుందని కూడా హెచ్చరించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అలాగే తాజాగా గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉచిత విద్యుత్ సహా చాలా వాటిని ఉచితంగా అందిస్తామని హామీలు గుప్పించిన నేపథ్యంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా నిరుద్యోగం గురించి అడిగిన ఒక ప్రశ్నకు సన్యాల్ సమాధానమిస్తూ వాస్తవానికి నిరుద్యోగం రేటు తగ్గుతోందని, ఉపాధి కల్పన బలంగా జరుగుతోందని చెప్పారు. అంతేకాకుండా ఉపాధి కల్పనకు భారీగా అవకాశాలు ఉన్న సేవారంగంలాంటి వాటికి ఉత్పాదకతతో ముడిపడిన ప్రోత్సాహకాల( పిఎల్‌ఐ) పథకాన్ని మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.