Monday, December 23, 2024

వన్డే సిరీస్ భారత్‌దే

- Advertisement -
- Advertisement -

India beat South Africa by 7 wickets in 3rd ODI

చెలరేగిన కుల్దీప్, సిరాజ్.. భారత్‌దే సిరీస్
సౌతాఫ్రికా 99 ఆలౌట్, చివరి వన్డేలో టీమిండియా ఘన విజయం
న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో మంగళవారం జరిగిన మూడో, చివరి వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌ను 21 తేడాతో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 27.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 19.1 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ శిఖర్ ధావన్ (8) మరోసారి విఫలమయ్యాడు. అయితే మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన శుభ్‌మన్ 57 బంతుల్లో 8 ఫోర్లతో 49 పరుగులు చేశాడు. ఇక ఇషాన్ కిషన్ (10), శ్రేయస్ అయ్యర్ 28 (నాటౌట్) తమవంతు పాత్ర పోషించారు.
ఆరంభం నుంచే
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. భారత బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టుకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (6)ను వాషింగ్టన్ సుందర్ వెనక్కి పంపాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ జానేమన్ మలన్ (15)ను సిరాజ్ పెవిలియన్ బాట పట్టించాడు. అంతేగాక వన్‌డౌన్‌లో వచ్చిన రిజా హెండ్రిక్స్ (3)ను కూడా సిరాజ్ ఔట్ చేశాడు. ఇక మార్‌క్రామ్ (9) షాబాజ్ అహ్మద్, కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (7)ను సుందర్ ఇంటిదారి పట్టించారు.
కుల్దీప్ మాయ
ఆ తర్వాత భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చెలరేగి పోయాడు. వరుస క్రమంలో వికెట్లు తీస్తూ సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను 99 పరుగులకే పరిమితం చేశాడు. అద్భుత బౌలింగ్‌ను కనబరిచిన కుల్దీప్ 4.1 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇక సిరాజ్, షాబాజ్, సుందర్‌లు చెరో రెండేసి వికెట్లను పడగొట్టారు. సౌతాఫ్రికా జట్టులో హెన్రిచ్ క్లాసెన్ (34) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇక మలన్ (15), జాన్‌సెన్ (14) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. మిగతావారి సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దీంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ వందలోపలే కుప్పకూలింది. కుల్దీప్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. హైదరాబాదీ స్పీడ్‌స్టర్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఇక సిరీస్‌లో తొలి వన్డేలో సౌతాఫ్రికా గెలవగా, టీమిండియా తర్వాతి రెండు మ్యాచుల్లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు టి20 సిరీస్‌ను కూడా భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే.

India beat South Africa by 7 wickets in 3rd ODI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News