దాదాపు ఎనిమిది మాసాలు కావొస్తున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం సోమవారం నాడు అత్యంత కీలకమైన భయానకమైన మలుపు తిరిగింది. అణు యుద్ధానికైనా వెనుకాడబోమని పుతిన్ ఇటీవలే హెచ్చరించిన నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై రష్యా జరిపిన దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ దాడుల్లో 20 మందికి పైగా మరణించారని, వంద మంది గాయపడ్డారని ఉక్రెయిన్ వైపు నుంచి వచ్చిన సమాచారం తెలియజేస్తున్నది. రష్యా ఆధీనంలోని క్రిమియాకు వెళ్లే ఒక వంతెనను ఉక్రెయిన్ సేనలు కూల్చివేయడంతో పుతిన్‌కు తీవ్రంగా కోపం వచ్చింది. తన 70వ జన్మదినం సందర్భంగా శుక్రవారం నాడు స్వస్థలం సెయింట్ పీటర్స్‌బర్గ్ వెళ్లిన పుతిన్ అక్కడి నుంచే నేషనల్ టెలివిజన్‌లో మాట్లాడారు.
మూడు నిమిషాల్లో ముగిసిన ఈ ప్రసంగంలో ఆయన ఉక్రెయిన్‌ను టెర్రరిస్టు దేశంగా పేర్కొన్నారు. పుతిన్ ఈసారి తన ప్రసంగంలో కేవలం ఉక్రెయిన్‌ను మాత్రమే నిందించి అమెరికాను గాని, నాటోను గాని ప్రస్తావించకపోడం పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. యుద్ధానికి తొందరలో తెర దించే ఉద్దేశంతోనే పుతిన్ తన ప్రసంగంలో నిగ్రహం పాటించారని అనుకుంటున్నారు. అయితే అందుకు ముందు ఉక్రెయిన్‌ను చావగొట్టి చెవులు మూసినంత పని చేయాలని ఆయన సంకల్పించినట్టు తెలుస్తున్నది. దాని ఫలితంగానే సోమవారం నాటి ముమ్మరమైన దాడులు చోటు చేసుకున్నాయి. భూ గగన సాగర తలాల నుంచి జరిగిన ఈ దాడుల్లో శక్తివంతమైన ఆయుధాలు ప్రయోగించారు. ఉక్రెయిన్‌లోని విద్యుత్తు, మంచినీటి సరఫరా వ్యవస్థలను, టూరిస్టు కేంద్రాలను లక్షంగా చేసుకున్నారు.
యుద్ధం ప్రారంభంలో చేసిన మాదిరిగానే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని కకావికలు చేసే లక్షంతో రష్యన్ సేనలు విరుచుకుపడ్డాయి. ఇటీవల డోంటెస్క్, ఖెర్సన్, లుహాన్‌స్క్, జపోరిఝిఝియా నగరాలను కలుపుకున్నప్పుడు వాటిని కాపాడుకోడానికి అణు యుద్ధానికైనా వెనుకాడనని పుతిన్ ప్రకటించారు. సోమవారం నాటి దాడులకు ప్రతీకారంగా ఉక్రెయిన్‌ను మరింత బలోపేతం చేయాలని అమెరికా, నాటో నిర్ణయించుకున్నట్టు వార్తలు చెబుతున్నాయి. అవి రష్యాతో పరోక్ష యుద్ధం చేస్తున్నాయి. గత ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైన తర్వాత కొద్ది రోజుల వరకు అది రష్యా ఉక్రెయిన్‌లకు మాత్రమే పరిమితమై జరిగింది. ఆ తర్వాత వెనుక నుంచి ఉక్రెయిన్‌కు అమెరికా విశేషంగా ఆయుధ సాయం చేయడం ప్రారంభించడంతో అది రష్యా పాశ్చాత్య కూటమి మధ్య యుద్ధంగా మారిపోయింది. ఇప్పుడు అమెరికా తలచుకొని రష్యా ఉక్రెయిన్ చర్చలకు తోడ్పడితే గాని యుద్ధం ఆగే పరిస్థితి కనిపించడం లేదు.
ఈలోగా ఇంత కాలం తటస్థంగా వుంటూ యుద్ధం మంచిది కాదని రష్యాకు, ఉక్రెయిన్‌కు సలహా ఇవ్వడానికే పరిమితమైన భారత దేశం సోమవారం నాడు ఉన్నట్టుండి తన ధోరణిని మార్చుకున్నది. నాలుగు ప్రాంతాలను కలుపుకొంటూ రష్యా తీసుకున్న చర్య అన్యాయమైనదని పేర్కొంటున్న ఆల్బేనియన్ తీర్మానంపై రహస్య ఓటింగ్ జరపాలన్న మాస్కో అభ్యర్థన మంగళవారం నాడు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఓటింగ్‌కు వచ్చింది. దీనిపై ఇండియా రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది. యుద్ధం మొదలైన దగ్గరి నుంచి ఇప్పటి వరకు రష్యాకు వ్యతిరేకంగా ఇండియా ఓటు వేయడం ఇదే మొదటిసారి. అమెరికా, దాని మిత్రదేశాలు ఎంతగా ఒత్తిడి తెచ్చినా తలొగ్గకుండా ఇండియా తటస్థ వైఖరినే అవలంబించింది. యుద్ధంపై రష్యాను ఖండించే ఓటింగ్‌కు దూరంగా వుంది.
ఇప్పుడు మొదటిసారిగా రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇండియా సహా 104 దేశాలు రష్యాకు వ్యతిరేకంగానూ, 16 దేశాలు దానికి అనుకూలంగానూ ఓటు వేయగా, 34 దేశాలు గైర్హాజరయ్యాయి. రష్యాతో పాటు చైనా కూడా ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఈ ఓటింగ్ సోమవారం నాడు ఉక్రెయిన్ నగరాలపై రష్యా సేనలు తీవ్రంగా విరుచుకుపడిన కొద్ది సేపటికి జరగడం విశేషం. యుద్ధం విషయంలో ఇక ముందు ఇండియా ఏ విధంగా వ్యవహరించబోతుందో రష్యాతో సంబంధాలు, అక్కడి నుంచి చవకగా భారీ ఎత్తున చేసుకుంటున్న క్రూడాయిల్ దిగుమతులు అదే విధంగా కొనసాగుతాయో లేదో అనే విషయాలకు వేచి చూడవలసిందే. మన విదేశాంగ మంత్రి జైశంకర్ మొన్ననే ఐక్యరాజ్య సమితిలో ఆస్ట్రేలియా ప్రతినిధితో మాట్లాడుతూ ఇండియాకు అమెరికా, పాశ్చాత్య దేశాల కంటే రష్యాయే నమ్మదగిన మిత్రుడని పేర్కొన్నారు.
ఎఫ్ 16ల ఆధునికీకరణ విషయంలో పాక్‌కు అమెరికా సాయపడుతున్న విషయాన్ని ఎత్తి చూపించారు. తన మాట పెడచెవిన పెట్టి ఉక్రెయిన్‌పై రష్యా అదే పనిగా సాగిస్తున్న దాడులకు భారత్ బాధపడినట్లు తెలుస్తోంది. కాని నాటోను రష్యా ముంగిట వుంచి ఉక్రెయిన్‌కు వెనుక నుంచి అమెరికా ఆయుధ సాయం అందించడాన్ని ఇండియా ఏ విధంగా పరిగణిస్తుందో తెలియవలసి వుంది.