సిమ్లా: దేశంలో నాలుగవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును గురువారం హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా రైల్వే స్టేషన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని అంబ్ అందౌరా, న్యూఢిల్లీ మధ్య ఈ రైలు నడుస్తుంది. ఇదివరకటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే నాలుగవ రైలు అత్యంత అధునాతనమైనది. తక్కువ బరువు ఉండడమే కాక తక్కువ సమయంలో ఎక్కువ వేగాన్ని పుంజుకునే సామర్ధం కొత్త రైలుకు ఉందని అధికారులు తెలిపారు. బుధవారాలు తప్పించి మిగిలిన ఆరు రోజులు ఇది నడుస్తుంది. అంబాలా, చండీగఢ్, ఆనంద్‌పూర్ సాహిబ్, ఉనాలో ఈ రైలు ఆగుతుంది. ఈ రైలును ప్రవేశపెట్టడం ద్వారా హిమాచల్ ప్రదేశ్‌లో పర్యాటక రంగం అభివృద్ధి పుంజుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, ఉనాలో పేఖుబేలా హెలిపాడ్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ స్వాగతం పలికారు. గడచిన ఐదేళ్లలో ప్రధాని రాష్ట్రాన్ని సందర్శించడం ఇది ఐదవసారి. వచ్చే ఏడాది హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
PM Modi inaugurates Vande Bharat Express in Una