వాషింగ్టన్: ప్రపంచం ఎదుర్కొంటున్న కొన్ని కీలకమైన సవాళ్ల నేపథ్యంలో వచ్చే సంవత్సరం జి20 సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న భారత్‌కు ఈ సదస్సును నిర్వహించడం కష్టసాధ్యమే అవుతుందని ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్)కు చెందిన ప్రధాన ఆర్థిక వేత్త పియిర్రీ ఆలివర్ గోరించాస్ బుధవారం పేర్కొన్నారు. జి20 దేశాల ప్రస్తుత సవాళ్లలో ఒకటి భౌగోళిక ఆర్థిక విభజనను ఎలా నెట్టుకు రావాలన్నదే. ఉక్రెయిన్‌పై రష్యా దాడి సాగిస్తుండడంతో మనకు ఎదురౌతున్న ఉద్రిక్తతల్లో దీని ప్రభావం కనిపిస్తోందని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో ఆయా దేశాల సామాన్య ప్రజల సమస్యలపై దేశాలను చర్చకు తీసుకురావడం భారత్‌కు కష్టమే అవుతుందని అభిప్రాయపడ్డారు. భౌగోళిక రాజకీయ అంశాలు ఇందులో ఇమిడి ఉండడమే కారణంగా పేర్కొన్నారు. ముఖ్యమైన అంశాలపై పురోగతి సాధించేలా సదస్సులో దేశాలు చర్చించేలా సమన్వయం చేయడం భారత్‌కు కష్టమే అవుతుందని చెప్పారు. ఆంగ్ల వార్తాసంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వూలో తన అభిప్రాయాలను వివరించారు. ఈ సదస్సు కేవలం ధనిక దేశాల గ్రూపు మాత్రమే కాదని, బహుళ దేశాల అభిప్రాయ వేదికని ఆయన వ్యాఖ్యానించారు. జి20 సదస్సు వల్ల ఎంతో పురోగతి సాధించ వలసి ఉందన్నారు.
Difficult task to India as G20 Chair: IMF