నల్గొండ: మునుగోడులో ఓటర్ల డ్రామాకు బిజెపి తెరలేపిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఎన్నికల సంఘం పూర్తిగా వాళ్ళ చేతిలోనే ఉంటుందని మునుగోడులో బీజేపీ నేతలు ఎన్నికల తేదీని ముందే చెప్పడంతో రుజువైందన్నారు. తెలంగాణ భవన్ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… దొంగ ఓట్లు నమోదు చేయించిందే బిజెపి, వాటిని అనుమతించేలా చేసింది కూడా బీజేపేనని ఆరోపించారు. కోర్టులకు వెళ్ళింది కూడా వాళ్లే, దొంగే దొంగ అన్నట్టు ఉందని ఎద్దేవాచేశారు. 40 శాతం ఓట్లు తొలగుంచబడ్డాయి అని బీజేపీ చెప్తోంది చేసింది.. మీరే కదా ? అని ప్రశ్నించారు. ప్రజా కోర్టులో బీజేపీ ఓటమి తధ్యం అని తేలిపోయిందన్నారు. ఓట్లు పోయాయి కాబట్టి ఓడిపోయామని చెప్పటానికే ఈ ప్రయత్నం చేస్తున్నారని పల్లా పేర్కొన్నారు. 18వేల కోట్ల రూపాయలకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయింది నిజం కాదా అని ప్రశ్నించారు. కేంద్ర బలగాలు తేవాలని చెప్తున్నారు. ఎన్ని బలగాలు తెచ్చిన నాగార్జునసాగర్, హుజుర్ నగర్ ఫలితమే ఇక్కడ రీపీట్ అవుతుందన్నారు. రాజగోపాల్ రెడ్డిని రాజకీయంగా బొంద పెట్టడం ఖాయమన్నారు. బిజెపి ఎన్ని కుట్రలు చేసినా రాజగోపాల్ రెడ్డి ఓటమి తప్పదని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.