Tuesday, December 24, 2024

నూకలు తినమన్నోళ్ల తోకలు కత్తిరిద్దాం

- Advertisement -
- Advertisement -

నాడు పుట్టెడు దుఖం..
నేడు పుట్లకొద్దీ ధాన్యం

రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

తెలంగాణ రాకముందు 64లక్షల టన్నుల ధాన్యం దిగుబడి.. 3.5లక్షల
టన్నులకు చేరిక నాడు 35లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి.. నేడు 65లక్షలకు.. కోటి 35
లక్షల పంట సాగు రాష్ట్రానికి గర్వకారణం బాయికాడ మీటర్లు పెట్టాలని కుట్రలు
చేస్తున్న కమలనాథులు రైతు అవగాహ సదస్సులో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుసంక్షేమ పథకాలు ఫలించి ధాన్యం ఉత్పత్తుల్లో తెలంగాణ రాష్ట్రం 3.50కోట్ల మెట్రిక్ టన్నులకు చేరుకుందని రాష్ట్ర పురపాలక ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మన్నెగూడ బీఎంఆర్ సార్ధ ఫంక్షన్ హాల్ లో శనివారం జరిగిన రైతు అవగాహన సదస్సులో మంత్రి కేటీఆర్‌తోపాటు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ,మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటిర్ మాట్లాడుతూ యాసంగి ధాన్యం కొనుగోళ్ల సందర్బంగా కేంద్ర ప్రభుత్వం చేసి వ్యాఖ్యలను ఉద్దేశించి నూకలు తినమన్న వారి తోకలు కత్తిరించాలన్నారు. ఆహారసూచీలో దేశాన్ని 107 లో నిలబెట్టారని ఎద్దవా చేశారు. ప్రధాని మోడి సర్కారు దక్షిణాసియాలో భారత్ ను పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ తర్వాత నిలబెట్టిందన్నారు. తెలంగాణలో తప్ప దేశంలో రైతు, వ్యవసాయ అనుకూల విధానాలు లేవని వెల్లడించారు. తెలంగాణ మినహా దేశంలోని మిగతా 27 రాష్ట్రాల్లో రైతు కంట కన్నీరు కారుతున్నదని ఆందోళన వెలిబుచ్చారు. రైతు కండువాను చూపి దేశం లో ఓట్ల కోసం వాడుకున్న నాయకులు ఉన్నారన్నారు. రాజకీయాల్లో బొడ్డూడని వాడు కూడా కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారన్నారు.

సరిగ్గ పదేళ్ల క్రితం తెలంగాణ పల్లెల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు పోతున్నాం కరంటు ఇడవమని కోరే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. కరంటు, సాగునీరు, విత్తనాలు, ఎరువుల కోసం తండ్లాడినం అని, ఆత్మహత్యలలో పాలమూరు, నల్లగొండ జిల్లాలది అగ్రస్థానంలో ఉండేదన్నారు. నేడు వరి ధాన్యం ఉత్పత్తిలో నల్లగొండ జిల్లాది అగ్రస్థానం అని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇది సాధ్యమయిందని గల్లా ఎగరేసి చెప్పొవచ్చన్నారు. నాడు కరంటు ఉంటే వార్త నేడు కరంటు పోతే వార్త అన్నారు. 24 గంటల కరంటు ఇస్తే గొప్పనా అని కొందరు అంటున్నారని , దేశంలోని 28 రాష్ట్రాల్లో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు.దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారో చూపే దమ్ము విపక్షాలకు ఉన్నదా అని ప్రశ్నించారు. 2014లో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు ఉండగా , నేడు రాష్ట్రంలో వరి ధాన్యం ఉత్పత్తి 3.50 కోట్ల టన్నులకు చేరుకున్నదని ప్రకటించారు. నాడు 35 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అయితే నేడు 65 లక్షల బేళ్లకు చేరుకున్నదన్నారు. స్వతంత్ర భారతంలో రైతుబంధు ఇవ్వాలని అలోచన చేసిన ఏకైక నేత కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు.

రైతుబంధు పథకం కింద రూ.68 వేల కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. రైతుబీమా కింద పరిహారంగా రూ.5 లక్షల జీవితభీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒక్కేటే అన్ని వెల్లడించారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరంటుకు ఏటా రూ.10,500 కోట్లు వెచ్చిస్తున్నట్టు వివరించారు. మోడీ 2014లో అధికారం ఇస్తే రైతుల ఆదాయం డబల్ చేస్తా అని ప్రకటించారని, కానీ వేలు, లక్షల రెట్లు ఆదాయం పెరిగింది దేశంలో ఆదానీది మాత్రమే అని స్పష్టం చేశారు. ఒక్కడు ధనవంతుడైతే ప్రజలు ధనవంతులు కారన్నారు. పల్లె జీవితాలను బలోపేతం చేయడం ద్వారా ప్రజలను బలోపేతం చేయాలన్నది కేసిఆర్ ప్రభుత్వ లక్ష్యం అని ప్రకటించారు. ఉచిత చేపపిల్లలతో తెలంగాణ మత్స్యసంపద దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కోటి 35 లక్షల ఎకరాలలో పంటల సాగు తెలంగాణకు గర్వకారణం అని ప్రకటించారు. పుట్ల కొద్ది తెలంగాణ రైతులు ధాన్యం పండిస్తే వాటిని కొనలేక కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిందన్నారు. నాలుగేళ్లకు సరిపడా నిల్వలు ఉన్నయి వడ్లు కొనం అని తెలంగాణ ప్రజలకు నూకలు తినడం నేర్పమని కేంద్ర మంత్రి అవహేళన చేశారని గుర్తు చేశారు.

రైతుల చైతన్యాన్ని మోడీ తక్కువ అంచనా వేస్తున్నాడన్నారు. మోటర్ల కాడ మీటర్లు పెట్టాలి అని మోడీ అన్నాడని, తన గొంతులో ప్రాణం ఉండగా బాయికాడ మీటర్లు పెట్టనని సిఎం కేసీఆర్ అన్నది గుర్తు చేశారు. మోటర్లకు ప్రీ పెయిడ్ మీటర్లు రైతాంగానికి గొడ్డలిపెట్టు అని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం చెబుతున్నదని , ప్రైవేటుకు కొనుగోళ్లు అంటే మన మరణ శాసనం మనం రాసుకున్నట్లే అని మంత్రి కేటిఆర్ రైతులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డిసిసిబి చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి, నల్లగొండ జిల్లా డిసిసిబి అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి, గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయి చంద్, మాజీ శాసన మండలి సభ్యులు కర్నే ప్రభాకర్, జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, జిల్లా డిసిసిబిలు, రైతుబంధుల అధ్యక్షులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News