Saturday, December 21, 2024

జర్నలిజానికి ముప్పు స్పైవేర్

- Advertisement -
- Advertisement -

Spyware is a threat to journalism

మనకు తెలియకుండానే మన ఫోన్‌లను తమ స్వాధీనం చేసుకోగల హైటెక్ ‘జీరో-క్లిక్’ స్పైవేర్ అభివృద్ధి ప్రజాస్వామ్య మౌలిక విలువలకు, వ్యక్తిగత గోప్యతకు ప్రమాదకారిగా మారుతుండగా, మరోవంక ఇది ప్రపంచంలో జర్నలిజం అస్తిత్వానికి పెను సంక్షోభంగా పరిణమించింది. ప్రపంచ వ్యాప్తంగా పాత్రికేయుల భద్రత కోసం పోరాడుతున్న కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సిపిజె) తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ అంశాన్ని వెల్లడి చేసింది. ‘పాత్రికేయులకు శత్రువుగా స్పైవేర్’ (జీరో-క్లిక్ స్పైవేర్: ఎనిమీ ఆఫ్ ది ప్రెస్, స్పైవేర్) పెడుతూ విడుదల చేసిన ఈ నివేదిక ఇటువంటి ధోరణులు కేవలం నిఘా ముప్పు కలిగించడమే కాకుండా ఉద్యోగాలు చేసే జర్నలిస్టుల సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. పైగా, దీనిని ఉపయోగించడం ద్వారా వారిని వేధింపులు, హింసకు గురి చేయడంతో పాటు కొన్ని సార్లు జైలు పాలు కూడా చేస్తుందని తెలిపింది.

ఎన్‌ఎస్‌ఒ గ్రూప్‌కు చెందిన పెగాసస్ సాఫ్ట్‌వేర్ వంటి అధునాతన నిఘా సాంకేతికత సిగ్నల్ వంటి ఎన్‌క్రిప్టెడ్ సేవల ద్వారా జర్నలిస్టుల పరికరాల్లోకి చొరబడి, నేరస్థులు ఫోన్ కాల్‌లు, ఫోటోలు, ఇ మెయిల్‌లు, సందేశాలను యాక్సెస్ చేయడానికి అవకాశం కలిపిస్తుంది. అయితే ఈ నిఘాను కనిపెట్టడం అసంభవంగా మారింది. ఈ స్పైవేర్‌పై మొదటగా ఐరోపా యూనియన్ ఆందోళన వ్యక్తం చేయగా, ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఒ ప్రతినిధి కేవలం ఉగ్రవాదులు, ఇతర నేరస్థుల కదలికలు కనిపెట్టడం కోసమే దీనిని రూపొందించినట్లు చెప్పుకొచ్చారు. దీని అమ్మకాలపై తాము నియంత్రణలు విధించి, దీనిని దుర్వినియోగం చేసే ప్రభుత్వాలపై చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు.

అయితే దీనిని కొనుగోలు చేసిన వారు దుర్వినియోగం చేస్తే కంపెనీ ఏ విధంగా తెలుసుకోగలదని, ఏ విధంగా బాధ్యత వహించగలదని ప్రశ్నలు తలెత్తినప్పుడు సమాధానం లభించడం లేదు. పలు ఐరోపా దేశాలలో విస్తృతంగా దుర్వినియోగం అయిన్నట్లు కథనాలు వెలువడినా ఎటువంటి సమాధానం చెప్పలేకపోతున్నారు. కొనుగోలు చేసిన వారు రోజువారీ ఏ విధంగా ఉపయోగిస్తారో తమకు సమాచారం ఉండదని ఆ కంపెనీ స్పష్టం చేసింది. భారత సుప్రీంకోర్టు పెగాసస్ సాఫ్ట్‌వేర్ వినియోగం గురించి లోతైన పరిశీలన చేసినప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం లభించకపోవడంతో ముందుకు వెళ్లలేకపోయింది. అమెరికాలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ ఎన్‌ఎస్‌ఒ గ్రూప్‌తో పాటు మరొక ఇజ్రాయెలీ స్పైవేర్ సంస్థను నిషేధిత సంస్థల జాబితాలో ఉంచింది. అమెరికా ప్రభుత్వం వారితో ఎలాంటి వ్యాపారం చేయకుండా నిషేధించింది.

ఆపిల్, పేస్‌బుక్ మాతృ సంస్థ మెటా వ్యక్తిగత ఫోన్‌లను హ్యాక్ చేయడానికి తమ మౌలిక సదుపాయాలను ఉపయోగించినందు కు ఎన్‌ఎస్‌ఒ గ్రూప్‌పై దావా వేసింది. అంతర్జాతీయంగా ఇటువంటి నిఘా పరికరాలపై ఆందోళన వ్యక్తం అవుతున్నది. అయితే వీటిపై నిషేధం విధించడం ఆచరణలో ఏమేరకు సాధ్యం అవుతుంది అన్నది ప్రశ్నార్ధకమే. ఉదాహరణకు 1990లో భూమిలో పేలుడు పదార్ధాలపై అంతర్జాతీయంగా నిషేధం విధించినా ఆచరణలో ఎటువంటి ప్రయోజనం ఉండకపోవడం తెలిసిందే. 2021లో బహిర్గతమైన పెగాసస్ ప్రాజెక్ట్ నివేదికలో పలువురు జర్నలిస్టులు నిఘాకు గురవుతున్నట్లు వెల్లడి అయినప్పటి నుండి తమ వృత్తి బాధ్యతల నిర్వహణలో ఏ విధంగా ప్రభావితం అవుతున్నామో అనే అంశంపై సిపిజే పలువురు జర్నలిస్టుల వ్యక్తిగత అనుభవాలను సేకరించింది.

హంగేరీ నుండి భారతదేశం, మెక్సికో నుండి మొరాకో వరకు నివేదికలలో, జర్నలిస్టులు సిపిజెతో మాట్లాడుతూ స్పైవేర్ కారణంగా తమకు సాధారణ సమావేశాలు జరపడం, వార్తల కోసం తమ వనరులతో సంప్రదించడం, సున్నితమైన అంశాలపై వార్తా కథనాలు సేకరించడం, చివరకు ప్రియమైన వారిని సంప్రదించడం కూడా కష్టమైపోతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2021 జులైలో పెగాసస్ ప్రాజెక్ట్ బహిర్గతం చేసిన 174 మంది భారతీయులలో కనీసం 40 మంది జర్నలిస్టులు ఉన్నారు. దాని తో ఇప్పుడు సున్నితమైన అంశాలపై జర్నలిస్ట్‌లతో ఫోన్‌లలో మాట్లాడడానికి చాలా మంది వెనకడుగు వేస్తున్నారు.

అయితే, అధికారికంగా ఎవ్వరిపై నిఘా ఉంచడం లేదని అంటూ ఇటువంటి కథనాలను భారత ప్రభుత్వం ఖండిస్తున్నప్పటికీ 2017 ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పెగాసస్‌ను కొనుగోలు చేసేందుకు అంగీకరించారని జనవరిలో న్యూయార్క్ టైమ్స్ అచురించిన వార్తా కథనంపై నేరుగా స్పందించకపోవడం గమనార్హం. స్పైవేర్ సాంకేతికత జర్నలిజానికి అస్తిత్వ సవాలుగా ఉంది. ఈ కృత్రిమ సాంకేతికత సంపాదకీయ ప్రణాళికను రాజీ పడేటట్లు చేస్తుంది. జర్నలిస్టులను విమర్శనాత్మక కథనాలపై నివేదించకుండా నిరోధించగలదు లేదా ముందుకు రాకుండా మూలాలను నిరుత్సాహపరుస్తుంది. జర్నలిజం ఆకృతికి మూలమైన స్వేచ్ఛగా, సురక్షితంగా నివేదించగల జర్నలిజం సామర్థానికి అంతరాయం కలిగిస్తుంది అని సిపిజె కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జిప్సి గిల్లెన్ కైజర్ తెలిపారు.

జర్నలిస్టుల కుటుంబాలు, సహచరులను కూడా లక్ష్యంగా చేసుకున్నప్పుడు వ్యక్తిగత జీవితాలకు కూడా విస్తరించి రిపోర్టింగ్‌కు స్పైవేర్ మరో ప్రమాద పొరను తెస్తుంది. ప్రతి చోటా ప్రజా ప్రతినిధులు ఈ సాంకేతికత ద్వారా ఎదురయ్యే బెదిరింపులను అరికట్టడానికి, అక్రమ స్పైవేర్ వినియోగానికి పాల్పడే వారిని అదుపులో ఉంచడానికి వేగంగా చర్య తీసుకోవాలి’ అని సూచించారు. స్పైవేర్ పరిశ్రమపై నియంత్రణ లేకపోవడం సాంకేతికత దుర్వినియోగాన్ని నిరోధించడం లేదా నిరుత్సాహపరచడం దాదాపు అసాధ్యం చేస్తుంది. జవాబుదారీతనం లేదా న్యాయం కోసం పరిమిత అవకాశాలను మాత్రమే అందిస్తుంది.

అంతర్జాతీయ మానవ హక్కులకు అనుగుణంగా ప్రభుత్వాలు పటిష్టమైన నిబంధనలను రూపొందించే వరకు స్పైవేర్ టెక్నాలజీల అభివృద్ధి, విక్రయం, వినియోగంపై తక్షణ తాత్కాలిక నిషేధంతో సహా స్పైవేర్ ఏకపక్ష లేదా చట్టవిరుద్ధమైన విస్తరణను ఎదుర్కోవడానికి ఈ సందర్భంగా సిపేజీ నివేదిక సమగ్ర విధాన సిఫార్సుల జాబితాను ముందుకు తెచ్చింది.

జర్నలిస్టులపై గూఢచర్యం చేసిన వారిపై ఎగుమతి నియంత్రణ, లక్షిత ఆంక్షలు విధించాలని పిలుపునిచ్చింది. స్పైవేర్‌ను కొనుగోలు చేయడానికి పత్రికా స్వేచ్ఛపై దాడి చేసే లేదా నియంత్రణ వనరులు లేని ప్రభుత్వ సంస్థలన్నింటిపై నిషేధం విధించాలి. విమర్శనాత్మకంగా, ప్రపంచ నియంత్రణ చర్యలు తీసుకొనే విషయంలో ఏకాభిప్రాయాన్ని రూపొందించడానికి అన్ని ప్రభుత్వా లు ఎగుమతి నియంత్రణలు, మానవ హక్కులలో చేరాలి. స్పైవేర్ దుర్వినియోగం నేడు మీడియా రంగాన్ని విశేష ప్రభావంపై గురిచేయడంతో పాత్రికేయ ప్రతిపాదికకే సవాల్‌గా మారుతున్నది. దీనిని అరికట్టడం కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో తగు యంత్రాంగాలను రూపొందించవలసిన అవసరం ఉంది. భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణలో అది కీలకం కాగలదు.

ముందుగా, అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వాలు పటిష్టమైన నిబంధనలను రూపొందించే వరకు స్పైవేర్ టెక్నాలజీల అభివృద్ధి, ఎగుమతి, అమ్మకం, బదిలీ, సర్వీసింగ్, వినియోగంపై తక్షణ తాత్కాలిక నిషేధాన్ని అమలు చేయాల్సి ఉంది. ముఖ్యంగా, పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టులపై దాడి చేసిన ట్రాక్ రికార్డ్ గల ప్రభుత్వాలకు విక్రయించే కంపెనీల నుండి స్పైవేర్ టెక్నాలజీని ఎగుమతి చేయడానికి లేదా లైసెన్స్ ఇవ్వకుండా ప్రభుత్వ ఏజెన్సీలను నిరోధించడమో లేదా వారి క్లయింట్‌లు చట్టవిరుద్ధంగా మీడియాను లక్ష్యంగా చేసుకోకుండా నిరోధించే యంత్రాంగాన్ని రూపొందించడంలో చేయాలి. జర్నలిస్టులకు వ్యతిరేకంగా స్పైవేర్ సాంకేతికతను ఉపయోగించకుండా స్పష్టమైన సంసిద్ధతను వ్యక్తం చేసే విధంగా జాతీయ స్థాయిలో చట్టాలు రూపొందించాలి. మీడియాకు వ్యతిరేకంగా డాక్యుమెంట్ చేసిన దుర్వినియోగ కేసులలో జవాబుదారీతనం, పరిష్కార విధానాలను ఏర్పాటు చేయాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News