హైదరాబాద్: ఎనిమిదేండ్లుగా అన్యాయం చేస్తున్న బిజెపికి ఓట్లు అడిగే హక్కు లేదని మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. డబ్బు పంచి ఎన్నికల్లో గెలుస్తామనే అహంకారంతో బిజెపి ఉందన్నారు. ఆ పార్టీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డి స్వార్ధం వల్లే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందన్నారు. కాంట్రాక్టుల కోసం కోమటిరెడ్డి రాజీనామా చేశాడని ఆయన దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తికి నియోజకవర్గ ప్రజలు తగురీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అందుకే టిఆర్‌ఎస్ ప్రచారానికి నియోజకవర్గం ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కూడా టిఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరి చాలా తొందరగానే ఆ పార్టీ రాజకీయాలు, జూటా మాటలు వంట బట్టించుకున్నారని విమర్శించారు.
మునుగోడులో బిజెపిని గెలిపిస్తే యావత్ తెలంగాణలో రూ. 3 వేలు ఇస్తమని ప్రధానమంత్రి, హోం మంత్రితో చెప్పించాలన్నారు. లేదంటే బేషరతుగా క్షమాపణ చెప్పి చెంపలు వేసుకోవాలని బిజెపి నేతలకు సూచించారు. దిక్కుమాలిన రాజకీయాలకు పాల్పడితే నల్లగొండ ప్రజలు సహించరన్నారు. ఇది చైతన్యవంతమైన ప్రాంతమన్నారు. గత ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలిచాక, ముడేళ్లలో ఒక్క సారి కనపడలేదని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారన్నారు. రాజగోపాల్ రెడ్డి అహంకారం గెలవాలా? మునుగోడు ప్రజల ఆత్మగౌరవం గెలవాలా? అని ప్రశ్నించారు. అసలు ఈ ఉపఎన్నిక ఎందుకు వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? ఏ ప్రయోజనాలు ఆశించి వచ్చింది? ఎందుకు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారన్న అంశాలపై నియోజకవర్గ ప్రజలు లోతుగా చర్చించుకుంటున్నారన్నారు.