ఆ 8 గుర్తులను తొలగించండి
టిఆర్‌ఎస్ లేఖకు స్పందించని ఇసి,
నేడు హైకోర్టుకు గులాబీ పార్టీ
మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో కారును పోలిన 8 గుర్తులను తొలగించాలంటూ టిఆర్‌ఎస్ న్యాయ పోరాటానికి దిగింది. హౌజ్ మోషన్ విచారణ చేపట్టాలని శనివారం కోరగా న్యాయమూర్తి ఇంట్లో అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని శనివారం నిర్ణయించింది. గుర్తుల జాబితా నుంచి కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు, డబ్బా, టివి, కుట్టుమిషన్, ఓడను తొలగించాలని కోరుతూ ఈ నెల 10న ఎన్నికల కమిషన్‌ను టిఆర్‌ఎస్ కోరింది. అయితే ఇసి నుంచి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నాలు చేస్తోంది. గతంలో 2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్థులకు నష్టం జరిగిందని టిఆర్‌ఎస్ చెబుతోంది. పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కన్నా ఈ గుర్తులతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. కారును పోలి ఉన్నందునే వాటికి ఓట్లు పడ్డట్లు స్పష్టమవుతోందని ఇసికి టిఆర్‌ఎస్ వివరించింది. మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్‌లో 2018 ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుకు సిపిఎం, బిఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్ధిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్‌లో కెమెరా గుర్తుకు కూడా బిఎస్పీ, సిపిఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ 8 గుర్తులను తొలగించాలని కోరారు. సోమవారం లంచ్ మోషన్‌కు అనుమతి కోరి పిటిషన్ వేసేందుకు టిఆర్‌ఎస్ సిద్ధమైంది.
Munugode by poll: TRS Party petition in High Court