కాబూల్ : అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారం లోకి వచ్చాక మహిళల హక్కులను కాలరాస్తూ అరాచక పాలన సాగిస్తున్నారు. అమ్మాయిలు ఏదైనా తప్పు చేస్తే బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ తాలిబన్ల అరాచకాలకు భయపడి బలవన్మరణానికి పాల్పడింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అఫ్గాన్ ఘోర్ ప్రావిన్స్‌లో ఓ మహిళ ప్రేమించిన వ్యక్తితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. దీంతో తాలిబన్లు ఆ వ్యక్తిని అక్టోబర్ 13న ఉరి తీశారు. మహిళను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. తాలిబన్ల చేతిలో భయానకంగా చావడం కంటే ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోవాలని ఆ మహిళ భావించింది. ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత ఏడాది ఆగస్టులో అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తరువాత తాలిబన్లు మహిళలపై ఎన్నో కఠిన ఆంక్షలు విధించారు. వారి హక్కులను కాలరాస్తున్నారు. అమ్మాయిలు ఆరో తరగతి వరకే చదువు కోవాలని నిబంధన పెట్టారు. మీడియాలో పనిచేసే దాదాపు 80 శాతం మంది మహిళలను ఉద్యోగాల నుంచి తొలిగించారు. అంతేకాదు, ప్రేమించిన వ్యక్తితో ఇల్లు వదిలి పారిపోతే దారుణంగా రాళ్లతో కొట్టి చంపుతున్నారు.