సింగపూర్: మొట్టమొదటిసారి ప్రపంచ హిందీ సదస్సుకు వచ్చే ఏడాది ఫిజీ ఆతిథ్యమివ్వనున్నది. హిందీకి ప్రపంచ భాషగా గుర్తింపు తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నంలో ఇది తొలి అడుగు అని ఫిజీలోని భారత హైకమిషనర్ పిఎస్ కార్తికేయన్ తెలిపారు. ఫిజీలో వచేచ ఏడాది ప్రపంచ హిందీ సదస్సును నిర్వహించాలని భారత్, ఫిజీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్ణయించినట్లు ది ఫిజీ టైమ్స్ పేర్కొంది. ఫిజియన్ నగరం నదిలో మూడు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో హిందీ భాషలో ప్రావీణ్యులైన పండితులు, రచయితలు, కవులు, సాహితీవేత్తలతో సహా వెయ్యి మందికి పైగా పాల్గొంటారని కార్తికేయన్‌ను ఉటంకిస్తూ పత్రిక తెలిపింది. త్వరలోనే సదస్సు తేదీలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఫిజీతోపాటు హిందీ మాట్లాడే దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారని ఆయన చెప్పారు. ఫిజీలో హిందీ భాషకు ప్రత్యేక స్థానం ఉంది. ఫిజీలోని మూడు అధికార భాషలలో హిందీ ఒకటి.