శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో మరోసారి మైనార్టీలు, వలస కూలీలను లక్షంగా చేసుకుని హత్యలు జరుగుతుండటం కలకలం రేపుతోంది. మొన్నటికి మొన్న ఓ కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపగా, తాజాగా షోపియాన్ జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున మరో ఇద్దరు వలస కూలీలు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. షోపియాన్ లోని హర్మెన్ ప్రాంతంలో వలస కూలీలు నివసిస్తున్న ఇంటిపైకి ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు కూలీలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్‌కు చెందిన రామ్‌సాగర్, మోనిశ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన తరువాత హర్మెన్ ప్రాంతంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టి ముష్కరుల కోసం గాలించారు. ఈ సోదాల్లో లష్కరే తోయిబాకు చెందిన హైబ్రిడ్ ఉగ్రవాది ఇమ్రాన్ బషీర్ గనీని పోలీసులు అరెస్టు చేశారు. కూలీల పైకి గ్రనేడ్ విసిరింది ఇమ్రానే అని తేలింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో తనిఖీలు కొనసాగుతున్నాయని జమ్ముకశ్మీర్ అదనపు డీజీపీ విజయ్‌కుమార్ వెల్లడించారు.