Monday, December 23, 2024

ఒక వ్యక్తి గెలవాలా.. మునుగోడు ప్రజలు గెలవాలా..: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao Election Campaign In Munugode

మునుగోడు: మర్రిగూడ మండల కేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన 200 మంది బిజెపి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రి హరీష్ రావు సమక్షంలో బుధవారం టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ…. మర్రిగూడ నీ.. మర్రి కూడా చూడని రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయమని మర్రిగూడ ప్రజలందరూ ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు. ప్రజలను ఒకసారి మోసం చేసిన రాజగోపాల్ రెడ్డి కి మళ్ళీ మళ్ళీ మోసం చేసే అవకాశం ప్రజలు ఇవ్వరని తెలిపారు. మునుగోడు ప్రజలకు పాలెందో నీళ్లు ఏందో అర్థమైందని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే సిలిండర్ ధరలు పెంచిన బిజెపి సబ్సిడీ సిలిండర్లు సంవత్సరానికి మూడు మాత్రమే ఇవ్వబోతున్నామని ప్రకటించింది. ట్యాంకర్లతో నీళ్లు మోసుకొని ఎంత బాధ పడ్డామో మునుగోడు ప్రజలు గుర్తు తెచ్చుకోవాలి. ఫ్లోరైడ్ బాధతో అంగవైకల్యం కలిగిన బాధితులు ఇంకా మన కళ్ళముందే ఉన్నారు. నల్గొండకు ఫ్లోరైడ్ సమస్యను తీర్చిన కేసీఆర్ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందన్నారు.

అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకునే టిఆర్ఎస్ పార్టీ వృద్ధులకు 2000 పెన్షన్ ఇస్తుంది. ఇందులో ఢిల్లీ బీజేపీది ఒక్క రూపాయి ఉందా అని అడుగుతున్నాను. పేద ఆడబిడ్డ పెళ్లయితే లక్ష రూపాయలు ఇస్తున్నాం. ఇందులో బీజేపీది రూపాయి ఉందా అని అడుగుతున్నాను. రైతుబంధు రైతు బీమాలో మీ రూపాయి ఉందా అని బీజేపీని అడుగుతున్నానని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు అయిపోగానే ఢిల్లీ పార్టీ నాయకులు అక్కడికే లైన్ కట్టి వెళ్ళిపోతారు ఇక్కడ ఉండేది కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని తేల్చిచెప్పారు. మన పార్టీని గెలిపించుకుంటే మునుగోడు అభివృద్ధి చెందుతుందని ఆయన వివరించారు. మీ కళ్ళ ముందే ఉండే టీఆర్ఎస్ పార్టీ కావాలా ఎక్కడో ఢిల్లీలో ఉండే బిజెపి కావాలా అనేది మునుగోడు ప్రజలు ఆలోచించాలని సూచించారు. ఇంటి జాగలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందన్నారు. ఈ నడి మంత్రం ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలిచి చేసేదేమీ లేదు. మళ్ళీ సంవత్సరం అయితే ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఈ అభివృద్ధితోనే మీ ముందుకి ఓటు అడగడానికి వస్తామన్నారు. ఈ మర్రిగూడెం అభివృద్ధి నా బాధ్యత. మూడు నెలలకు ఒకసారి వచ్చి సంవత్సరంలో మర్రిగూడను అభివృద్ధి చేసి చూపిస్తానని మంత్రి హరీశ్ భరోసా కల్పించారు. రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఒక వ్యక్తిగా అతనికి లాభం అవుతుంది. ప్రభాకర్ రెడ్డి గెలిస్తే మునుగోడు ప్రజలందరికీ మేలు జరుగుతుంది. ఒక వ్యక్తి గెలవాలా.. మునుగోడు ప్రజలు గెలవాలా ఆలోచించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News