న్యూఢిల్లీ : భారత్-పాక్ సరిహద్దులకు సమీపం లోని దీసా వద్ద త్వరలో ఏర్పాటు కానున్న వాయుసేన స్థావరం దేశ రక్షణలో కీలకంగా మారుతుందని ప్రధాని మోడీ అన్నారు. ఆయన బుధవారం గుజరాత్ లోని గాంధీనగర్‌లో డిఫెన్స్ ఎక్స్‌పో 2022 ను ప్రారంభించారు. భారతీయుల వ్యాపార నైపుణ్యాలపై ప్రపంచానికి ఉన్న నమ్మకాన్ని ఇది బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. భారత్ ఆఫ్రికా దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా “మిషిన్ డిఫ్‌స్పేస్” అనే కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. అంతరిక్షానికి సంబంధించిన రక్షణ ఏర్పాట్లు కోసం దీనిని మొదలు పెట్టారు. అంతరిక్ష విభాగంలో మన రక్షణ దళాలకు అవసరాలను తీర్చేందుకు సృజనాత్మక పరిష్కారాలు కనుగొనేందుకు దీన్ని ఏర్పాటు చేశారు.
బుధవారం నుంచి గాంధీనగర్ లో మొదలైన డిఫెన్స్ ఎక్స్‌పో అక్టోబర్ 22 వరకు కొనసాగుతుంది. దాదాపు రూ. 1000 కోట్ల వ్యయంతో ఉత్తరగుజరాత్ లోని బనాసకంఠ జిల్లాలో దీసా వద్ద వాయుసేన నిర్మిస్తున్న స్థావరానికి ప్రధాని వర్చువల్ విధానంలో భూమి పూజ చేశారు. భారత దళాలు సమాంతరంగా గగనతల, సముద్ర ఆపరేషన్లు నిర్వహించేందుకు ఈ స్థావరం అవకాశం కల్పిస్తుంది. విదేశీదాడులకు వేగంగా స్పందించడానికి వీలు లభిస్తుంది. ఈ ప్రాజెక్టు 21 నెలల్లో పూర్తి కానుంది. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ సత్తాను ఇది ప్రదర్శిస్తుందన్నారు. డిఫెన్స్‌ఎక్స్‌పో 2022 లో మొత్తం 1340 కంపెనీలు పాల్గొనగా, 451 ఒప్పందాలు జరిగే అవకాశాలున్నాయి. 75 దేశాల ప్రతినిధులు దీనిలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద రక్షణ రంగ ప్రదర్శన ఇదే కావడం విశేషం.